CWC 2023: అందుకే దాన్ని ఫైనల్‌ అంటారు.. అసలు సమయంలో ఆడిందే లెక్క: కైఫ్‌నకు వార్నర్‌ కౌంటర్‌

22 Nov, 2023 20:56 IST|Sakshi

ICC CWC 2023 Winner Australia: టీమిండియా మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ కైఫ్‌ వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ కౌంటర్‌ ఇచ్చాడు. మీరంటే నాకిష్టం అంటూనే.. అసలైన రోజున ఆడినవాళ్లకు మాత్రమే విజేతలుగా నిలిచే అర్హత దక్కుతుందని ఉద్ఘాటించాడు.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో లీగ​ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. తద్వారా టేబుల్‌ టాపర్‌గా ఫైనల్‌ చేరింది భారత జట్టు.

మరోవైపు.. ఆరంభంలో రెండు వరుస పరాజయాలు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా తర్వాత వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి.. తుదిమెట్టుకు చేరుకుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో టీమిండియాతో ఫైనల్లో జయభేరి మోగించి.. ఏకంగా ఆరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.

అయితే, ఈ మ్యాచ్‌ ముగిసిన అనంతరం టీమిండియా మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ కైఫ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘అత్యుత్తమ జట్టు వరల్డ్‌కప్‌ గెలిచిందంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను.

ఎందుకంటే పేపర్‌ మీద చూస్తే టీమిండియా అత్యుత్తమంగా కనిపిస్తోంది’’ అని కైఫ్‌ అన్న క్లిప్పింగ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో గ్లెన్‌ మిచెల్‌ అనే యూజర్‌ కైఫ్‌ వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటో షేర్‌ చేయగా.. వార్నర్‌ స్పందించాడు.

‘‘నాకు ఎంకే(మహ్మద్‌ కైఫ్‌) అంటే ఇష్టమే.. అయితే.. పేపర్‌ మీద ఏం కనబడుతుందన్న విషయంతో సంబంధం లేదు. అసలైన సమయంలో మన ప్రదర్శన ఎలా ఉందన్నదే ముఖ్యం. అందుకే దానిని ఫైనల్‌ మ్యాచ్‌ అంటారు. అదే అన్నిటికంటే కీలకం. అదే ఆటకు అర్థం. 2027లో చూద్దాం’’ అంటూ వార్నర్‌ ఎక్స్‌ వేదికగా వ్యాఖ్యానించాడు.

చదవండి: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకిలా విషం చిమ్మడం?

మరిన్ని వార్తలు