CWC 2023: అది ఆస్ట్రేలియాకు మాత్రమే సాధ్యం! 2015 కంటే ఈ విజయమే గొప్పది!

20 Nov, 2023 03:53 IST|Sakshi

CWC 2023 Winner Australia: ‘2015 కంటే ఈ విజయమే గొప్పది, ఎందుకంటే ఇది భారత గడ్డపై వచ్చింది’... హాజల్‌వుడ్‌ వ్యాఖ్య ఇది. ఇదే ఈ విజయం విలువేమిటో చెబుతోంది. టోర్నీ ఆరంభంలో 2 మ్యాచ్‌లలో ఓడిన తర్వాత పాయింట్ల పట్టికలో ఆ్రస్టేలియా అట్టడుగున ఉంది. ఫలితం మాత్రమే కాదు ప్రదర్శన కూడా చెత్తగా ఉంది.

రెండు మ్యాచ్‌లలో జట్టు 199, 177 పరుగులే చేయగలిగింది. దాంతో అందరూ ఆసీస్‌ని తేలిగ్గా తీసుకున్నారు. కానీ తర్వాతి మ్యాచ్‌ నుంచి మొదలు పెడితే సెమీస్‌ వరకు వరుసగా ఎనిమిదో విజయాలతో ఆ జట్టు దూసుకుపోయింది.

న్యూజిలాండ్‌తో, సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో అతి కష్టమ్మీద గెలవడంతో ఫైనల్‌ కూడా భారతే ఫేవరెట్‌గా కనిపించింది. కానీ పట్టుదల, చివరి వరకు ఓటమిని అంగీకరించని తర్వాత ఉన్న కంగారూ బృందం ఎప్పటిలాగే ఐసీసీ టోర్నీలో అసలు సమరంలో సత్తా చాటింది. ప్రధాన పోటీల్లో ఒత్తిడికి తలవంచని తమ బలాన్ని మళ్లీ చూపించింది.

ప్రపంచ కప్‌కు ముందు హెడ్‌ చేతికి గాయమైంది. అతని స్థానంలో మరో ఆటగాడిని ఎంచుకునే అవకాశం ఉన్నా ఆసీస్‌ ఆ పని చేయక 14 మందితోనే జట్టును కొనసాగించింది. ఇప్పుడు అతను సెమీస్, ఫైనల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు.

టోర్నీకి ప్రకటించిన టీమ్‌లో లబుషేన్‌కు చోటు దక్కలేదు. స్పిన్నర్‌ అగర్‌ గాయపడగా... అతని స్థానంలో మరో స్పిన్నర్‌ను ఎంచుకోకుండా లబుషేన్‌ను తీసుకుంది. జట్టు కుప్పకూలిపోకుండా మిడిలార్డర్‌లో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు సరైన వాడని ఆసీస్‌ భావించింది. ఫైనల్లో అతను అదే చేసి చూపించాడు. వార్నర్, మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ అనుభవం ఇక్కడా బాగా పని చేయగా, మార్ష్‌ కూడా రెండు కీలక శతకాలు బాదాడు.

ముఖ్యంగా అఫ్గానిస్తాన్‌పై 91/7తో ఓటమికి చేరువైన దశలో మ్యాక్స్‌వెల్‌ చేసిన డబుల్‌ సెంచరీ నభూతో నభవిష్యత్‌. స్టార్క్, హాజల్‌వుడ్‌ చెరో 16 వికెట్లతో జట్టుకు చుక్కానిలా నిలవగా, లెగ్‌స్పిన్నర్‌ జంపా 23 వికెట్లతో సత్తా చాటాడు.

అన్నింటికి మించి పేసర్‌గా, కెప్టెన్‌ కమిన్స్‌ ముద్ర ప్రత్యేకం. బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టడంతో పాటు వ్యూహాలపరంగా అతను చూపించిన సాహసం, తెగువ కమిన్స్‌ను ప్రత్యేకంగా నిలిపాయి.

ఫైనల్లో తన 10 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా భారత్‌ను కట్టి పడేయగలిగాడు. 2023లో డబ్ల్యూటీసీ, యాషెస్, వరల్డ్‌ కప్‌ కోసం సన్నద్ధమయ్యేందుకు ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నానని ప్రకటించిన కమిన్స్‌... ఈ మూడింటిలోనూ అద్భుత విజయాలతో ఆసీస్‌ గొప్ప నాయకుల్లో ఒకడిగా తన స్థానాన్ని లిఖించుకున్నాడు. 

–సాక్షి క్రీడా విభాగం 

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు