ఆరు సార్లు జగజ్జేతలు.. అయినా ఎలాంటి హడావుడి లేదు.. సాధారణ వ్యక్తుల్లా..! 

22 Nov, 2023 12:59 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023 గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు నిన్ననే స్వదేశానికి చేరుకుంది. ఆరోసారి జగజ్జేతలుగా నిలిచిన ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు ఎయిర్‌పోర్ట్‌లో అతి సాధారణమైన స్వాగతం లభించింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎప్పటిలాగే ఇళ్లకు పయనమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆసీస్‌ క్రికెటర్లు సాధారణ ప్యాసింజర్లలా తమ లగేజ్‌ను తామే మోసుకెళ్లారు. 

తమ జట్టు ఆరోసారి జగజ్జేతగా అవతరించినా ఆస్ట్రేలియన్లు ఎలాంటి హడావుడి చేయలేదు. ఆసీస్‌ క్రికెటర్లు సైతం తామేదో సాధించామని ఫీలవుతున్నట్లు ఎక్కడా కనపడలేదు. సాధారణంగా ఏ జట్టైనా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిస్తే, స్వదేశంలో వారికి అపురూపమైన స్వాగతం లభిస్తుంది. సత్కారాలు, ఆరుపులు, కేకలతో అభిమానులు నానా హంగామా చేస్తారు. 

అయితే ఆసీస్‌ జట్టు ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి తొలిసారి స్వదేశంలో అడుగుపెట్టినప్పుడు అలాంటి వాతావరణం ఎక్కడా కనపడలేదు. ఎలాంటి డ్రామాకు ఆస్కారం లేకుండా అతి తక్కువ మంది ఫోటోగ్రాఫర్ల సమక్షంలో ఆసీస్‌ ఆటగాళ్లు ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెళ్లిపోయారు. ఆసీస్‌ ఆటగాళ్లు సాధించినదానికి క్రెడిట్‌ తీసుకోవడానికి ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాలేదు. అరుపులు, కేకలు అస్సలు లేవు. వ్యక్తి పూజ అంతకంటే లేదు.

ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఎయిర్‌పోర్ట్‌లో నుంచి బయటకు వెళ్తున్న వీడియోను ఓ నెటిజన్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి ఆస్ట్రేలియన్ల సింప్లిసిటీని కొనియాడాడు. వారి నుంచి చాలా నేర్చుకోవాలని కామెంట్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా.. టీమిండియాపై ఆరు వికెట్ల తేడాతో గెలపొంది ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు