హరికృష్ణ సంచలనం 

20 Sep, 2020 02:53 IST|Sakshi

ప్రపంచ చెస్‌ చాంపియన్‌ కార్ల్‌సన్‌పై విజయం

సాక్షి, హైదరాబాద్‌: ముఖాముఖి అయినా... ఆన్‌లైన్‌లో అయినా... క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్‌ విభాగాల్లో ప్రస్తుతం ప్రపంచ చెస్‌ చాంపియన్‌గా ఉన్న మాగ్నస్‌ కార్ల్‌సన్‌పై ఓ గేమ్‌లో గెలవడమంటే విశేషమే. సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ ఆన్‌లైన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ సందర్భంగా భారత రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ ఈ అద్భుతం చేసి చూపించాడు. బ్లిట్జ్‌ విభాగంలో భాగంగా ప్రపంచ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌తో జరిగిన గేమ్‌లో హరికృష్ణ తెల్ల పావులతో ఆడుతూ 63 ఎత్తుల్లో గెలుపొంది సంచలనం సృష్టించాడు.  

15 ఏళ్ల తర్వాత.... 
అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం తన కెరీర్‌లో కార్ల్‌సన్‌తో 18 సార్లు తలపడిన హరికృష్ణ కేవలం రెండోసారి మాత్రమే గెలిచాడు. ఈ గేమ్‌కంటే ముందు ఏకైకసారి 2005లో జూనియర్‌ స్థాయిలో ఉన్నపుడు లుసానే యంగ్‌ మాస్టర్స్‌ టోర్నీలో కార్ల్‌సన్‌పై హరికృష్ణ 56 ఎత్తుల్లో గెలిచాడు. వీరిద్దరి ముఖాముఖి గేముల్లో కార్ల్‌సన్‌ 10 గేముల్లో... హరికృష్ణ 2 గేముల్లో నెగ్గారు. మిగతా ఆరు గేమ్‌లు ‘డ్రా’ అయ్యాయి.  

ఆరో స్థానంలో... 
సెయింట్‌ లూయిస్‌ ఓపెన్‌ టోర్నీలో భాగంగా బ్లిట్జ్‌ విభాగంలో తొమ్మిది గేమ్‌లు ముగిశాక హరికృష్ణ 12.5 పాయింట్లతో ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌లో సంయుక్తంగా ఆరో స్థానంలో ఉన్నాడు. బ్లిట్జ్‌లో తొమ్మిది గేమ్‌లు ఆడిన హరికృష్ణ రెండు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, నాలుగు గేముల్లో ఓడాడు. కార్ల్‌సన్‌ (నార్వే), జియోంగ్‌ (అమెరికా) లపై నెగ్గిన హరికృష్ణ... డొమింగెజ్, సో వెస్లీ (అమెరికా), గ్రిస్‌చుక్‌ (రష్యా), అలీరెజా (ఇరా న్‌) చేతిలో ఓటమి చవిచూశాడు. నకముర (అమె రికా), అరోనియన్‌ (అర్మేనియా), నెపోమ్‌నియాచి (రష్యా)లతో గేమ్‌లను‘డ్రా’గా ముగించాడు.

మరిన్ని వార్తలు