Ravichandran Ashwin: ఐపీఎల్‌లో ఆడలేను!

27 Apr, 2021 04:29 IST|Sakshi

కరోనా తీవ్రత నేపథ్యంలో లీగ్‌ నుంచి తప్పుకున్న అశ్విన్‌ 

ముగ్గురు ఆసీస్‌ క్రికెటర్లు కూడా ఇంటికి  

చెన్నై: భారత సీనియర్‌ క్రికెటర్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ కరోనా తాజా పరిస్థితులతో కలత చెందాడు. కోవిడ్‌–19 విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు తన ఆత్మీయులు ఒకవైపు ప్రయ త్నిస్తుండగా, మరో వైపు తాను క్రికెట్‌ ఆడలేనంటూ స్పష్టం చేశాడు. తాజా సీజన్‌ ఐపీఎల్‌నుంచి తప్పుకుంటున్నట్లు అతను ప్రకటించాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్‌నుంచి విరామం తీసుకుంటున్నాను.

నా కుటుంబంతో పాటు బంధుమిత్రులు ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో వారికి అండగా నిలవాలనుకుంటున్నాను. మున్ముందు పరిస్థితులు మెరుగుపడితే మళ్లీ వచ్చి ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు. లీగ్‌లో అశ్విన్‌ 5 మ్యాచ్‌లు ఆడాడు. దేశం పరిస్థితి చూస్తుంటే తన గుండె బద్దలవుతోందని...తన వం తుగా ఎవరికైనా సహాయం చేసే అవకాశం ఉంటే తాను సిద్ధమేనంటూ మూడు రోజుల క్రితం కూడా అశ్విన్‌ ట్వీట్‌ చేయడాన్ని బట్టి చూస్తే అతను మానసికంగా సంఘర్షణకు లోనైనట్లు అర్థమవుతోంది.  

మా వల్లా కాదు...
భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మున్ముందు ఆంక్షలు విధిస్తే స్వదేశం చేరలేమనే ఆందోళనతో ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్‌నుంచి తప్పుకున్నారు.  ఆర్‌సీబీ జట్టులో ఉన్న కేన్‌ రిచర్డ్సన్, ఆడమ్‌ జంపాలతో పాటు రాజస్తాన్‌ టీమ్‌ సభ్యుడు ఆండ్రూ టై లీగ్‌కు గుడ్‌బై చెప్పారు. రిచర్డ్సన్, జంపా ‘వ్యక్తిగత కారణాలు’ అంటూ వెల్లడించగా...సుదీర్ఘ కాలంగా బయో బబుల్‌లో ఉంటున్న ఒత్తిడిని తట్టుకోలేకపోయానని టై స్పష్టం చేశాడు. గత ఆగస్టు నుంచి 11 రోజులు మాత్రమే టై తన ఇంట్లో గడిపాడు.   
 

మరిన్ని వార్తలు