RCB Vs DC: భళా భరత్‌... చివరి బంతికి సిక్సర్‌తో గెలిపించిన ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌!

9 Oct, 2021 06:30 IST|Sakshi

చివరి బంతికి సిక్సర్‌తో బెంగళూరును గెలిపించిన ఆంధ్ర బ్యాట్స్‌మన్‌

మెరిసిన మ్యాక్స్‌వెల్, సిరాజ్‌  

దుబాయ్‌: ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ఆంధ్ర క్రికెటర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ హీరోగా అవతరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైజాగ్‌కు చెందిన భరత్‌ సూపర్‌ షోతో అదరగొట్టాడు. ఆఖరి ఓవర్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు విజయానికి 15 పరుగులు అవసరం కాగా... తొలి మూడు బంతులకు 7 పరుగులు లభించాయి. దాంతో బెంగళూరు విజయ సమీకరణం చివరి మూడు బంతుల్లో 8 పరుగులుగా మారింది. స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న భరత్‌... అవేశ్‌ ఖాన్‌ వేసిన నాలుగో బంతికి పరుగులు రాబట్టలేకపోయాడు. ఐదో బంతికి రెండు పరుగులు సాధించడంతో... ఆఖరి బంతికి 6 పరుగులు అవసరమయ్యాయి. అయితే అవేశ్‌ ఖాన్‌ వైడ్‌ వేయడంతో... బెంగళూరు గెలుపు సమీకరణం చివరి బంతికి ఐదు పరుగులుగా మారింది.

ఉత్కంఠ తారస్థాయికి చేరిన ఈ సమయంలో ఎటువంటి ఒత్తిడికి లోనుకాని భరత్‌ ... లాంగాన్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాది జట్టును గెలిపించాడు. దాంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై బెంగళూరు 7 వికెట్లతో గెలిచి లీగ్‌ను విజయంతో ముగించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శ్రీకర్‌ భరత్‌ (52 బంతుల్లో 78 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్‌ (33 బంతుల్లో 51 నాటౌట్‌; 8 ఫోర్లు) అజేయమైన నాలుగో వికెట్‌కు 111 పరుగులు జోడించారు. అంతకుముందు ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా (31 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శిఖర్‌ ధావన్‌ (35 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్‌మైర్‌ (22 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సిరాజ్‌ (2/25) ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసి గెలుపొందింది.

సూపర్‌ ఛేజింగ్‌...
ఛేదనలో బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. పడిక్కల్‌ (0), కెపె్టన్‌ కోహ్లి (4) వెంట వెంటనే అవుటవ్వగా... అశలు పెట్టుకున్న డివిలియర్స్‌ (26 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా నిరాశ పరిచాడు. అయితే ఈ సమయంలో క్రీజులో ఉన్న భరత్, మ్యాక్స్‌వెల్‌ జట్టును గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. అదే సమయంలో ఢిల్లీ పేలవ ఫీల్డింగ్‌ కూడా బెంగళూరుకు కలిసొచ్చింది. అక్షర్‌ వేసిన 14వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ ఇచి్చన రెండు సులభమైన క్యాచ్‌లను శ్రేయస్‌ అయ్యర్, అశి్వన్‌ జారవిడిచారు. ఈ క్రమంలో భరత్‌ 37 బంతుల్లో... మ్యాక్స్‌వెల్‌ 32 బంతుల్లో అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఇక చివరి ఓవర్లో వీరిద్దరూ చెలరేగడంతో బెంగళూరుకు విజయం ఖాయమైంది.

స్కోరు వివరాలు  
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) గార్టన్‌ (బి) చహల్‌ 48; ధావన్‌ (సి) క్రిస్టియాన్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 43; పంత్‌ (సి) భరత్‌ (బి) క్రిస్టియాన్‌ 10; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) క్రిస్టియాన్‌ (బి) సిరాజ్‌ 18; హెట్‌మైర్‌ (సి) కోహ్లి (బి) సిరాజ్‌ 29; రిపల్‌ పటేల్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164.
వికెట్ల పతనం: 1–88, 2–101, 3–108, 4–143, 5–164.
బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 3–0–29–0, సిరాజ్‌ 4–0–25–2, గార్టన్‌ 3–0–20–0, యజువేంద్ర చహల్‌ 4–0– 34–1, హర్షల్‌ పటేల్‌ 4–0–34–1, క్రిస్టియాన్‌ 2–0–19 –1.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) రబడ (బి) నోర్జే 4; దేవదత్‌ పడిక్కల్‌ (సి) అశ్విన్‌ (బి) నోర్జే 0; శ్రీకర్‌ భరత్‌ (నాటౌట్‌) 78; డివిలియర్స్‌ (సి) శ్రేయస్‌ అయ్యర్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 26; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 51; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 166.
వికెట్ల పతనం: 1–3, 2–6, 3–55.
బౌలింగ్‌: నోర్జే 4–0–24–2, అవేశ్‌ ఖాన్‌ 4–0– 31–0, అక్షర్‌ పటేల్‌ 4–0–39–1, కగిసో రబడ 4–0–37–0, అశ్విన్‌ 1–0–11–0, రిపల్‌ పటేల్‌ 3–0–22–0.

>
మరిన్ని వార్తలు