విధ్వంసకర ఇన్నింగ్స్‌.. వన్డేల్లో హెన్రిచ్‌ క్లాసెన్‌ వరల్డ్‌ రికార్డు! వాళ్లిద్దరిని వెనక్కినెట్టి..

16 Sep, 2023 15:39 IST|Sakshi

దక్షిణాఫ్రికా బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్‌లు బాది 174 పరుగులు సాధించాడు. 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్‌ 57 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత 26 బంతుల్లో మరో 74 పరుగులు సాధించాడు. 

రికార్డుల క్లాసెన్‌
తద్వారా క్లాసెన్‌ పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు. వన్డే చరిత్రలో అత్యంత వేగంగా ఆస్ట్రేలియాపై శతకం బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటర్‌ 52 బంతుల్లో ఆసీస్‌పై శతక్కొట్టాడు. 

అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా
అదే విధంగా.. వన్డే క్రికెట్‌ చరిత్రలో క్లాసెన్‌ ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు.. ఒకే బౌలర్‌ బౌలింగ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గానూ నిలిచాడు.

ఆడం జంపా బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు బాది ఈ ఘనత సాధించాడు. గతంలో ఆడం ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అఫ్గనిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఏడు సిక్స్‌లు కొట్టాడు. 2019 వరల్డ్‌కప్‌ సందర్భంగా మోర్గాన్‌ ఈ రికార్డు సాధించాడు.

వన్డేల్లో క్లాసెన్‌ వరల్డ్‌ రికార్డు
ఇవన్నీ ఒకెత్తైతే.. వన్డేల్లో 200కు పైగా స్ట్రైక్‌రేటుతో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి క్రికెటర్‌గా క్లాసెన్‌ చరిత్ర సృష్టించడం వేరే లెవల్‌! అంతకు ముందు ఈ రికార్డు సంయుక్తంగా.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌(245.45 స్ట్రైక్‌రేటుతో 162 పరుగులు నాటౌట్‌), ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌(231.41 స్ట్రైక్‌రేటుతో 162 పరుగులు, నాటౌట్‌) పేరిట ఉండేది. 

ఆడం జంపా చెత్త రికార్డు
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో క్లాసెన్‌తో పాటు.. మిల్లర్‌ (45 బంతుల్లో 82 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), డసెన్‌ (62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అదరగొట్టారు. దాంతో తొలుత దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 416 పరుగులు సాధించింది. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధికంగా ఏడుసార్లు 400 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు నెలకొల్పింది. భారత్‌ ఆరుసార్లు ఈ ఘనత సాధించింది. 

సిరీస్‌ సమం
మరోవైపు ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా 10 ఓవర్లలో 113 పరుగులిచ్చాడు. వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా మిక్‌ లూయిస్‌ (10 ఓవర్లలో 113; ఆస్ట్రేలియా; 2006లో దక్షిణాఫ్రికాపై) పేరిట ఉన్న చెత్త రికార్డును జంపా సమం చేశాడు. 

ఇక 417 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 34.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అలెక్స్‌ క్యారీ (77 బంతుల్లో 99; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ కోల్పోయాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు 2–2తో సమంగా ఉన్నాయి. చివరిదైన ఐదో వన్డే ఆదివారం జరుగుతుంది. 

చదవండి: టీమిండియాకు షాక్‌.. ఫైనల్‌కు ఆల్‌రౌండర్‌ దూరం! లంకకు యువ క్రికెటర్‌..

మరిన్ని వార్తలు