రాజస్తాన్‌ రాత మారేనా!

3 Apr, 2021 05:42 IST|Sakshi

వరుస సీజన్లలో రాయల్స్‌ పేలవ ప్రదర్శన

రెండో టైటిల్‌పై ఆశలు 

సాక్షి క్రీడా విభాగం: ఐపీఎల్‌ మొదలైనప్పుడు టీమ్‌ వేలంలో అన్నింటికంటే తక్కువ విలువ పలికి ఎలాంటి అంచనాలు లేకుండా కనిపించిన జట్టు చివరకు తొలి చాంపియన్‌గా నిలిచి అబ్బురపరచింది. అయితే రాజస్తాన్‌ రాయల్స్‌ ఆనందం ఆ ఒక్కసారికే పరిమితమైంది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కారణంగా రెండేళ్ల నిషేధాన్ని మినహాయిస్తే మిగిలిన పది సీజన్లలో కేవలం మూడుసార్లు మాత్రమే టీమ్‌ ప్లే ఆఫ్స్‌ చేరగలిగిందంటే జట్టు ఎంత పేలవంగా ఆడిందో అర్థమవుతుంది. ఒక ‘కోర్‌ గ్రూప్‌’ అంటూ లేకుండా ప్రతీసారి ఎక్కువ మంది కొత్త ఆటగాళ్లతో కనిపించే ఈ టీమ్‌ సమష్టి సన్నాహాలతో తమ అస్త్రశస్త్రాలు, వ్యూహాలు సిద్ధం చేసుకునే సరికే పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. దిగ్గజ క్రికెటర్‌ సంగక్కర మార్గనిర్దేశనం, కొత్త కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ సారథ్యంలోనైనా రాజస్తాన్‌ తమ పాత రాజసాన్ని ప్రదర్శిస్తుందా అనేది ఆసక్తికరం.

కొత్తగా వచ్చినవారు...  
గత అనుభవాల కారణంగా రాజస్తాన్‌కు డెత్‌ బౌలర్ల అవసరం కనిపించింది. దీంతో పాటు విదేశీ ఆటగాళ్ల కోసం అవసరమైతే ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉంచుకోవాల్సి వచ్చింది. అందుకే క్రిస్‌ మోరిస్‌కు రికార్డు మొత్తం (రూ.16.25 కోట్లు) చెల్లించింది. చివరి ఓవర్లలో బౌలింగ్‌ చేయడంతో పాటు బ్యాటింగ్‌లో ఫినిషర్‌గా ఉపయోగపడగల మోరిస్‌ను అందుకే ఎంచుకుంది. ఒక భారత ఆల్‌రౌండర్‌ వేటలో శివమ్‌ దూబే (రూ.4.40 కోట్లు)ను దక్కించుకుంది. ప్రత్యామ్నాయ విదేశీ బౌలర్‌గా బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తఫిజుర్‌ రహమాన్‌ (రూ.1 కోటి) జట్టులోకి వచ్చాడు. పెద్దగా గుర్తింపు లేకపోయినా ప్రతిభ గల సౌరాష్ట్ర లెఫ్టార్మ్‌ పేసర్‌ చేతన్‌ సకరియా (రూ.1.20 కోట్లు)కు కూడా భారీ మొత్తమే చెల్లించింది. వీరు కాకుండా ఇంగ్లండ్‌ ఆటగాడు లివింగ్‌స్టోన్, భారత దేశవాళీ క్రికెటర్లు కేసీ కరియప్ప, ఆకాశ్‌ సింగ్, కుల్దీప్‌ యాదవ్‌ (ఢిల్లీ) జట్టులోకి వచ్చారు.  

జట్టు వివరాలు  

భారత ఆటగాళ్లు:
సంజూ సామ్సన్‌ (కెప్టెన్‌), అనూజ్, ఉనాద్కట్, త్యాగి, మహిపాల్‌ లోమ్రోర్, మనన్‌ వోహ్రా, మయాంక్‌ మార్కండే, రాహుల్‌ తెవాటియా, రియాన్‌ పరాగ్, శ్రేయస్‌ గోపాల్, యశస్వి జైస్వాల్, శివమ్‌ దూబే, చేతన్‌ సకరియా, కరియప్ప, కుల్దీప్‌ యాదవ్, ఆకాశ్‌ సింగ్‌.

విదేశీ ఆటగాళ్లు: టై, స్టోక్స్, మిల్లర్, ఆర్చర్, జోస్‌ బట్లర్, మోరిస్, ముస్తఫిజుర్, లివింగ్‌స్టోన్‌.
సహాయక సిబ్బంది: వార్న్‌ (బ్రాండ్‌ అంబాసిడర్‌ అండ్‌ మెంటార్‌), సంగక్కర (డైరెక్టర్, క్రికెట్‌ ఆప రేషన్స్‌), పెన్నీ (అసిస్టెంట్‌ కోచ్‌), మజుందార్‌ (బ్యాటింగ్‌ కోచ్‌), కాజెల్‌ (పేస్‌ బౌలింగ్‌ కోచ్‌), బహుతులే (స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌), ఇష్‌ సోధి (స్పిన్‌ కన్సల్టెంట్‌), దిశాంత్‌ యాజ్ఞిక్‌ (ఫీల్డింగ్‌ కోచ్‌).  

తుది జట్టు అంచనా/ఫామ్‌
నలుగురు విదేశీ ఆటగాళ్లలో స్టోక్స్, మోరిస్, బట్లర్‌ కచ్చితంగా అన్ని మ్యాచ్‌లు ఆడతారు. గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు ఆర్చర్‌ అందుబాటులో లేడు కాబట్టి అతని స్థానంలో ముస్తఫిజుర్, ఆండ్రూ టైలలో ఒకరికి అవకాశం దక్కుతుంది. భారత్‌తో సిరీస్‌లో రాణించిన బట్లర్‌ను ఈసారి రాజస్తాన్‌ ఓపెనర్‌గా ఆడిస్తే ప్రయోజనం కలుగుతుంది. ఈ రకంగా చూస్తే మిడిలార్డర్‌లో మిల్లర్‌కు అవకాశం రావడం సులువు కాదు. భారత ఆటగాళ్లలో ఓపె నర్‌ యశస్వి, సామ్సన్‌లపై బ్యాటింగ్‌ భారం ఉంది. ఆల్‌రౌండర్లు దూబే, తెవాటియా కూడా జట్టుకు భారీ స్కోరు అందించగలరు. పేసర్లలో త్యాగి, ఉనాద్కట్‌ జట్టులో ఉంటారు.

గోపాల్, మయాంక్‌లలో ఒకరికే స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా అవకాశం దక్కవచ్చు. తాజా ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే స్టోక్స్, బట్లర్‌లకు రాయల్స్‌ రాత మార్చే సామర్థ్యం ఉంది. సామ్సన్‌ కూడా ఎప్పటిలాగే ఒక అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి ఆపై వరుసగా విఫలం కావడం కాకుండా నిలకడగా రాణిస్తే జట్టు బలం పెరుగుతుంది. విధ్వంసకర ప్రదర్శన, ప్రత్యర్థిపై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించినట్లు కాకుండా రాజస్తాన్‌ పడుతూ, లేస్తూనే అప్పుడప్పుడు మ్యాచ్‌లు గెలుస్తూ వస్తోంది. తమ ప్రధాన లోపం అయిన నిలకడలేమిని ఆ జట్టు అధిగమిస్తేనే ముందంజ వేయగలుగుతుంది. కొత్తగా జట్టు బాధ్యతలు తీసుకున్న సంగక్కర ఈ విషయంలో విజయం సాధించాల్సి ఉంది.    

అత్యుత్తమ ప్రదర్శన
తొలి ఐపీఎల్‌ (2008) చాంపియన్‌
2020లో ప్రదర్శన: 14 లీగ్‌ మ్యాచ్‌లలో 6 గెలిచి, 8 ఓడిన టీమ్‌ టోర్నీలో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి శుభారంభం చేసిన టీమ్‌ తర్వాతి 12 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలవగలిగింది. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌ (20 వికెట్లు) ఒక్కడే కాస్త నిలకడైన ప్రదర్శన కనబర్చగా... తెవాటియా ఒక మెరుపు ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకోగలిగాడు. ఇవి తప్ప చెప్పుకోవడానికేమీ లేదు. స్టోక్స్‌ అన్ని మ్యాచ్‌లు ఆడకపోగా... కీలక సమయాల్లో సంజూ సామ్సన్‌ వైఫల్యం జట్టును నష్టపరిచింది.  

మరిన్ని వార్తలు