SAT20 League 2024: సన్‌రైజర్స్‌ పేసర్‌ సంచలనం.. ఫైనల్‌ చేరిన డిఫెండింగ్‌ చాంపియన్‌

7 Feb, 2024 08:51 IST|Sakshi
ఫైనల్‌ చేరిన డిఫెండింగ్‌ చాంపియన్‌(PC: SAT20 X)

SA20, 2024 Qualifier 1 - Sunrisers Eastern Cape won by 51 runs: సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్‌-1లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసి.. ఈ సీజన్‌లో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.  

దంచికొట్టిన మలన్‌
సొంతమైదానం న్యూలాండ్స్‌లో మంగళవారం డర్బన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ డేవిడ్‌ మలన్‌(45 బంతుల్లో 63 రన్స్‌) దంచికొట్టగా.. కెప్టెన్‌ ఐడెన్‌ మార్కరమ్‌(23 బంతుల్లో 30) కూడా రాణించాడు.

చెలరేగిన ఒట్నీల్‌, జాన్సెన్‌
వీరిద్దరి ఇన్నింగ్స్‌ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్‌ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు స్కోరు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌కు సన్‌రైజర్స్‌ పేసర్లు ఒట్నీల్‌ బార్ట్‌మన్‌, మార్కో జాన్సెస్‌ చుక్కలు చూపించారు.

51 పరుగుల తేడాతో రైజర్స్‌ గెలుపు
ఇద్దరూ తలా నాలుగేసి వికెట్లు పడగొట్టి డర్బన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించారు. వీరికి తోడు స్పిన్నర్‌ లియామ్‌ డాసన్‌ రెండు కీలక వికెట్లు తీసి 106 పరుగులకే డర్బన్‌ జట్టును ఆలౌట్‌ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. రైజర్స్‌ విధించిన టార్గెట్‌ను పూర్తిచేయలేక 19.3 ఓవర్లకే డర్బన్ ఇలా చేతులెత్తేయడంతో 51 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.

అద్భుత బౌలింగ్‌తో
డర్బన్‌ బ్యాటర్లలో క్వింటన్‌ డికాక్‌(20), వియాన్‌ మల్దర్‌(38), హెన్రిచ్‌ క్లాసెన్‌(23) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇక సన్‌రైజర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు.

డర్బన్‌కు మరో అవకాశం
ఇదిలా ఉంటే.. డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌కు క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం ఉంది. పర్ల్‌ రాయల్స్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విజేతతో డర్బన్‌ ఫైనల్లో చోటు కోసం తలపడాల్సి ఉంటుంది.

చదవండి: జింబాబ్వే పర్యటనకు టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌.. షెడ్యూల్‌ ఇదే

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega