IND vs AUS: కింగ్‌ కోహ్లి అరుదైన ఘనత.. భారత దిగ్గజం రికార్డు బద్దలు

10 Mar, 2023 21:35 IST|Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఓ అరుదైన రికార్డును విరాట్‌ తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లను అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో నాథన్‌ లియోన్‌ క్యాచ్‌ పట్టిన కోహ్లి.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ 334 క్యాచ్‌లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇక ప్రపంచ క్రికెట్‌లో  శ్రీలంక దిగ్గజ ప్లేయర్ మహేళ జయవర్దనే 440 క్యాచ్‌లతో తొలి స్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్(364), రాస్ టేల్(351), జాక్వస్ కల్లీస్(338) ద్రవిడ్ కంటే ముందున్నారు. ఇక టెస్టు క్రికెట్ విషయానికి వస్తే.. విరాట్‌ ఇప్పటివరకు 109 క్యాచ్‌లు అందుకున్నాడు.

ఈ క్రమంలో భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్(108)ను కింగ్‌ కోహ్లి అధిగమించాడు.  ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఆసీస్‌ బ్యాటర్లు  ఉస్మాన్‌ ఖవాజా(180), గ్రీన్‌(114) అద్భుత సెంచరీలతో అదరగొట్టారు.

భారత బౌలర్లలో 6 వికెట్లతో అశ్విన్‌ సత్తాచాటాడు. కాగా అతడిపాటు షమీ రెండు వికెట్లు, అక్షర్‌, జడేజా తలా వికెట్‌ సాధించారు. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు రోహిత్ శర్మ (17 బ్యాటింగ్‌) శుభ్‌మన్‌ గిల్‌ (18 బ్యాటింగ్‌) అజేయంగా ఉన్నారు.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. తొలి భారత బౌలర్‌గా! దరిదాపుల్లో ఎవరూ లేరు

>
మరిన్ని వార్తలు