WC 2023: అతడు అద్భుతం.. క్రెడిట్‌ మొత్తం వాళ్లకే.. ఆ రెండు మ్యాచ్‌లు గెలుస్తాం: బాబర్‌

31 Oct, 2023 21:35 IST|Sakshi

WC 2023 Ban Vs Pak: Babar Azam Credits  to the boys: ‘‘మా ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించారు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌.. ఇలా మూడు విభాగాల్లోనూ అదరగొట్టారు. ఈ క్రెడిట్‌ మొత్తం వాళ్లకే దక్కుతుంది. ఫఖర్‌ జమాన్‌ గనుక 20-30 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. తనదైన శైలిలో ఆటను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. తనను ఇలా చూడటం సంతోషంగా ఉంది.

తదుపరి రెండు మ్యాచ్‌లు కూడా గెలిచేందుకు మేము శాయశక్తులా కృషి​ చేస్తాం. అప్పుడు మేము ఎక్కడిదాకా చేరుకుంటామో చూద్దాం! ఈరోజు షాహిన్‌ మాకు అద్భుత ఆరంభం అందించాడు.

నిజానికి బంగ్లా ఇన్నింగ్స్‌లో 15-20 ఓవర్ల మధ్యలో వాళ్లు మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఆ సమయంలో మా ప్రధాన బౌలర్లు వాళ్లను విడగొట్టడంలో సఫలమయ్యారు. మిడిల్‌ ఓవర్లలో వికెట్లు పడగొట్టగలిగారు’’ అంటూ పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం హర్షం వ్యక్తం చేశాడు.

బంగ్లాదేశ్‌పై పాక్‌ విజయం
ఈడెన్‌ గార్డెన్స్‌లో తమకు మద్దతుగా నిలిచినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా కోల్‌కతాలో మంగళవారం నాటి మ్యాచ్‌లో పాక్‌.. బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది.

ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుని సెమీస్‌ రేసులో ఇంకా తాము ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది. మరోవైపు.. బాబర్‌ ఆజం బృందం చేతిలో ఓడిన బంగ్లాదేశ్‌ అధికారికంగా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. 

అతడు అద్భుతం
ఈ నేపథ్యంలో వరుసగా నాలుగు ఓటముల తర్వాత దక్కిన విజయంపై స్పందించిన బాబర్‌ ఆజం సంతోషం వ్యక్తం చేశాడు. కోల్‌కతా ప్రేక్షకులు తమకు అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న పాక్‌ ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌పై బాబర్‌ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు.

అదే విధంగా తమ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది ఆరంభంలోనే బంగ్లాను దెబ్బకొట్టగా.. అంతా కలిసి సమిష్టిగా బంగ్లాదేశ్‌ను ఓడించగలిగామని తమ ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.

కాగా ఆరంభ మ్యాచ్‌లలో విఫలమైన ఫఖర్‌ జమాన్‌ బంగ్లాతో మ్యాచ్‌లో అద్భుత అర్ధ శతకంతో పాక్‌కు విజయాన్ని అందించడం విశేషం. ఈ క్రమంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ టోర్నీలో పాక్‌ తదుపరి న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌లతో తలపడనుంది.

బంగ్లాదేశ్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ స్కోర్లు
►వేదిక: ఈడెన్‌ గార్డెన్స్‌, కోల్‌కతా
►టాస్‌: బంగ్లాదేశ్‌- బ్యాటింగ్‌

►బంగ్లాదేశ్‌ స్కోరు: 204 (45.1)
►పాకిస్తాన్‌ స్కోరు: 205/3 (32.3)
►ఫలితం: బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో పాక్‌ విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ఫఖర్‌ జమాన్‌(74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 81 పరుగులు).

చదవండి: Virat Kohli: అల్లుడు కాదు!.. కోహ్లినే నా ఫేవరెట్‌ అంటున్న బాలీవుడ్‌ స్టార్‌! ఎందుకంటే..

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు