IPL 2024-Shubham Dubey: తండ్రిది పాన్‌ షాప్‌.. గ్లవ్స్‌ కొనేందుకు కూడా డబ్బులు లేవు! ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్లు

21 Dec, 2023 11:15 IST|Sakshi

ఐపీఎల్‌.. ఎంతో మంది యువ ఆటగాళ్లను క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం చేసింది. చాలా మంది క్రికెటర్ల జీవితాలను మార్చేసింది. అనామిక క్రికెటర్లను కోటీశ్వరలను చేసింది. తాజాగా ఈ జాబితాలోకి విధర్బ ఆటగాడు శుభమ్‌ దూబే చేరాడు. ఐపీఎల్‌-2024 వేలంతో దుబే కోటీశ్వరుడు అయిపోయాడు.  ఈ వేలంలో దుబేను రూ.5.8 కోట్ల భారీ ధరకు రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగొలు చేసింది.

అయితే దూబే ఈ స్ధాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కనీసం మంచి గ్లవ్స్‌ కొనేందుకు కూడా ఇబ్బంది పడ్డ దూబే.. ఇప్పుడు జోస్‌ బట్లర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ వంటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌రూమ్‌ను పంచుకోనున్నాడు. ఈ క్రమంలో ఎవరీ శుభమ్‌  దూబే అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.

ఎవరీ శుభమ్‌ దుబే..?
29 ఏళ్ల శుభమ్‌ దూబే నాగ్‌పూర్‌లోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి బద్రీప్రసాద్‌ దూబె పాన్‌ షాప్‌ను నిర్వహించేవాడు. అతడి సోదరుడు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దిరి సంపాదనపైనే దుబే కుటంబం ఇప్పటివరకు జీవనం గడుపుకుంటూ వచ్చింది. అయితే చిన్నతనం నుంచే దూబే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ.

కానీ క్రికెట్‌ కొనుకోవడానికి కూడా అతడి దగ్గర డబ్బులు లేకపోయేవి. ఈ సమయంలో విధర్బ మాజీ క్రికెటర్‌, దివంగత సుదీప్ జైస్వాల్‌ దుబేలోనే టాలెంట్‌ను గుర్తించారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన సుదీప్ జైస్వాల్‌ అడ్వకేట్‌ XI అనే క్రికెట్‌ క్లబ్‌ను నడిపేవాడు. ఆర్ధిక స్ధోమత లేని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అన్ని విధాల సాయం ఈ క్లబ్‌ తరపున సుదీప్ చేసేవాడు.

ఆటగాళ్ల శిక్షణ, టోర్నీలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులను సుదీప్ భరించేవాడు. దూబేకు కూడా అర్ధికంగా సాయం చేసి మెంటార్‌గా వ్యవహరించాడు. అతడి పరిచయమే దుబే కెరీర్‌ను మలుపు తిప్పింది. దీంతో విదర్భ అండర్‌-19, అండర్‌-23 జట్లలో చోటు దక్కించుకున్న శుభమ్‌.. సత్తా చాటి సీనియర్‌ జట్టులోకి వచ్చాడు.

అయితే దుబే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మాత్రం ఇప్పటివరకు అరంగేట్రం చేయలేదు. కానీ టీ20ల్లో మాత్రం దుబేకు మంచి రికార్డు ఉంది. లోయరార్డ్‌లో వచ్చి పవర్ హిట్టింగ్‌ చేసే సత్తా అతడికి ఉంది. ఈ ఏడాది ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శుభమ్ దూబే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో 222 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 20 టీ20లు ఆడిన దుబే 485 పరుగులు చేశాడు.
చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో వన్డే.. తిలక్‌పై వేటు! ఆర్సీబీ ప్లేయర్‌ అరంగేట్రం

>
మరిన్ని వార్తలు