అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు?

2 Mar, 2024 13:01 IST|Sakshi
హార్దిక్‌ పాండ్యా (PC: BCCI)

స్టార్‌ క్రికెటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌లను వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో బీసీసీఐని కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొంత మంది మాజీ క్రికెటర్లు ​మాత్రం తప్పుబడుతున్నారు.

కాగా సెంట్రల్‌ కాంట్రాక్టు కలిగి ఉన్న క్రికెటర్లందరూ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా తప్పక దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. కోచ్‌, కెప్టెన్‌, సెలక్టర్ల సూచనల మేరకు ఎవరైతే దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సి ఉంటుందో నిర్ణయిస్తామని తెలిపింది.

ముఖ్యంగా ఫిట్‌గా ఉన్న యువ ఆటగాళ్లు బోర్డు సూచించినపుడు తప్పక డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడాలని ఆటగాళ్లను ఆదేశించింది. అయితే, అయ్యర్‌, ఇషాన్‌ ఈ నిబంధనలు ఉల్లంఘించారనే వార్తల నడుమ.. వారిద్దరి సెంట్రల్‌ కాంట్రాక్టు రద్దు చేయడం ఇందుకు బలాన్నిచ్చింది. 

ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌.. శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌లకు అండగా నిలబడ్డాడు. వారికి మద్దతుగా నిలుస్తూ.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వంటి వాళ్లకు మాత్రం ఈ నిబంధనల నుంచి ఎలా మినహాయింపు ఇస్తారని ప్రశ్నించాడు.

ఈ క్రమంలో మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా స్పందిస్తూ.. ‘‘హార్దిక్‌ పాండ్యా విషయాన్ని సంక్లిష్టం చేయాల్సిన అవసరం లేదు. అతడు ఎన్నో ఏళ్లుగా రెడ్‌ బాల్‌ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

కాబట్టి ఈ నిబంధన విషయంలో అతడి గురించిన ప్రస్తావనే అనవసరం. అతడు టెస్టు సిరీస్‌లకు అందుబాటులోనే ఉండటం లేదు. అలాంటపుడు అతడిని ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడమని చెప్పడంలో అర్థమే లేదు. 

నాలుగు రోజుల మ్యాచ్‌కు ఓ ఆటగాడి శరీరం సహకరించనపుడు. గాయాల బారిన పడే ప్రమాదం ఉందనీ తెలిసినపుడు అలాంటి వ్యక్తిని ఎవరూ కూడా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడమని ఆదేశించరు. 

ఒకవేళ తను టెస్టు ఆడేందుకు పూర్తి ఫిట్‌గా ఉంటే.. తను టీమిండియాకు ఆడటం మానేసి.. ప్రమోషన్‌ షూట్లలో పాల్గొంటే అప్పుడు తనది తప్పని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం అతడు ఇలాంటి తప్పులేమీ చేయలేదు. కాబట్టి బీసీసీఐకి అతడిని శిక్షించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు.

చదవండి: Shreyas Iyer: సెమీస్‌ తుదిజట్టులో అయ్యర్‌.. రహానే కీలక వ్యాఖ్యలు

whatsapp channel

మరిన్ని వార్తలు