మాయలు, మంత్రాలు.. ఆనక హత్యలు!

12 Dec, 2023 17:08 IST|Sakshi

మాయలు, మంత్రాలు.. ఆనక హత్యలు!

ఓ నరహంతకుడి నేరచరిత్రను వెలికితీసిన ఖాకీలు!

సత్యనారాయణ బాగోతాలపై గతంలోనే సాక్షి కథనం!

సాక్షి, మహ‌బూబ్‌న‌గ‌ర్/నాగ‌ర్‌క‌ర్నూల్: 'మంత్రాలు, మాయలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ, బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ, విడిపోయిన భార్యభర్తలను కలుపుతానంటూ.. 11  మంది అమాయకపు ప్రాణాలను తీసిన రాక్షసుడ్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి.. మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

వివరాల్లోకి వెళ్తే.. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన రామాటి సత్యనారాయణ యాదవ్(47) గ‌తంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి. త‌న తండ్రి, ముత్తాత‌ల నుంచి వార‌స‌త్వంగా వస్తున్నటువంటి నాటువైద్యం ఆసరాగా చేసుకుని మాయ‌మాటలు చెప్పి ప్రజలను నమ్మించాడు. ఆపై మంత్రతంత్రాలతో గుప్త నిధులు వెలికి తీసిస్తానంటూ, బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రజల్ని నమ్మబలికాడు. వారి ఆస్తులను, ఇంటి స్థలాలను కాజేశాడు.

అదే త‌న వృత్తిగా కొనసాగిస్తూ.. ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెడుతూ, చివరికి ప్రశ్నించిన వారి ప్రాణాలను తీస్తూ వచ్చాడు. ఈ మ‌ధ్య కాలంలో ఇద్దరు భార్యాభర్తలు విడిపోయిన వారిని కలుపుతానంటూ, వారి ఇంటి స్థలం త‌న పేరున‌ రిజిస్ట‌ర్ చేయించుకున్నాడు. ఆపై ఆ మహిళా కనిపించకుండా పోవ‌డంతో.. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన వివరాలను సేకరించి, పోలీసులు గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. చివ‌రికి గ‌త కొన్ని రోజులుగా ఎవ‌రి కంట ప‌డ‌కుండా త‌ప్పించుకుంటున్న నిందితుడిని అరెస్టు చేశామ‌ని జిల్లా ఎస్పీ తెలిపారు. 

ఓ రియల్టర్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి..
పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు సత్యనారాయణ యాదవ్‌ ఇప్పటివరకు 11 మంది అమాయకులను హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుల జాబితాలో మూడేళ్ల కిందట 2020 ఆగస్టు 14న వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల సమయంలో అపస్మారక స్థితిలో మరణించిన ఉన్న నలుగురు వ్యక్తులు హజిరాబీ(60), ఆష్మా బేగం (32), ఖాజా (35), ఆశ్రీన్‌ (10) ఉన్నారని తెలుస్తోంది.

రెండేళ్ల కిందట నాగర్‌కర్నూల్‌ మండలం గన్యాగులకి చెందిన లింగస్వామి, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, కల్వకుర్తి పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని సైతం హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి వెంకటేశ్‌ కన్పించడం లేదని అతని భార్య లక్ష్మీ హైదరాబాద్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సత్యనారాయణ యాదవ్‌ బాగోతం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా మంత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ యాదవ్‌ బాగోతాలపై ఈ ఏడాది ఏప్రిల్‌ 5వ తేదీన ‘మాయగాళ్లు’శీర్షికన ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. బాధితులు ఫిర్యాదు చేస్తున్నా విచారణపై నిర్లక్ష్యం చేస్తున్న పోలీసుల తీరును ఆ కథనంలో ప్రస్తావించింది. అయినా ఆ టైంలో పోలీసుల్లో కదలిక లేకపోవడం గమనార్హం.

ఇవి కూడా చ‌ద‌వండి: మిస్ట‌రీగా మారిన 'కాంగో జాతీయుడి లాక‌ప్ డెత్!' ఆరోజు ఏం జరిగింది?

>
మరిన్ని వార్తలు