జుట్టుపట్టి.. చితగ్గొట్టి.. మహిళపై విచక్షణారహిత దాడి

16 Apr, 2022 17:04 IST|Sakshi

సాక్షి, మొయినాబాద్‌: ప్లాటు పక్కనుంచి వేస్తున్న సీసీ రోడ్డు విషయంలో గొడవపడి ఓ మహిళపై దాయాదులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆరు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై వెంటనే ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. మండల పరిధిలోని మేడిపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి గ్రామానికి చెందిన కావలి భాగ్యమ్మకు చెందిన ప్లాటులో నుంచి వారి దాయాదులు కారోబార్‌గా పనిచేస్తున్న కావలి అశోక్, అతని భార్య వార్డు సభ్యురాలు కల్పన ఇంటికి పైప్‌లైన్‌ వేశారు. ఆ ప్లాటు పక్కనుంచి సీసీ రోడ్డు వేస్తున్నారు.

ఈ నెల 10న సీసీ రోడ్డు పనులు జరుగుతుండగా తన ప్లాటులో నుంచి పైప్‌లైన్‌ వేయడంతో గుంత ఏర్పడిందని.. సిమెంటు వేసి దాన్ని పూడ్చాలని కోరింది. రోడ్డు పనులు చేస్తున్న కారోబార్‌ అశోక్, వార్డు సభ్యురాలు కల్పన, భాగ్యమ్మతో గొడవకు దిగారు. మాటామాట పెరిగి గొడవ పెద్దది కావడంతో అశోక్‌ ఆమెను తోసేశాడు. అశోక్, కల్పన, వారి కొడుకు భాగ్యమ్మను కింద పడేసి విచక్షణారహితంగా కొట్టారు. అదే రోజు బాధితురాలు మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కానీ పోలీసులు పట్టించుకోలేదు. కనీసం విచారణ చేయకుండా వదిలేశారు. ఆ రోజు నుంచి ప్రతీ రోజు బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు తిరుగుతున్నా పోలీసులు స్పందించలేదు. దీంతో శుక్రవారం బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. పోలీసులు పట్టించుకోకుంటే పోలీస్‌స్టేషన్‌ ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను మీడియాకు చూపింది. అప్పుడు స్పందించిన పోలీసులు శుక్రవారం సాయంత్రం కేసు నమోదు చేసి విచారణకు వెళ్లారు. 

ఇరువర్గాల వారు ఫిర్యాదు చేశారు 
మేడిపల్లిలో ప్లాటు పక్కన వేస్తున్న సీసీ రోడ్డు విషయంలో ఇరువర్గాలు గొడవపడ్డాయి. ఇరువర్గాలవారు ఫిర్యాదు ఇచ్చారు. గ్రామంలోనే మాట్లాడి సమస్య పరిష్కరించుకుంటామని చెప్పారు. కానీ మేము కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుంటాం. 
– లక్ష్మీరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ మొయినాబాద్‌ 

>
మరిన్ని వార్తలు