సాగర్‌లో బీజేపీకీ షాక్‌..టీఆర్‌ఎస్‌లోకి బీజేపీ కీలక నేత!

31 Mar, 2021 04:03 IST|Sakshi

అనుచరులతో కలసి గులాబీ దళంలోకి కడారి అంజయ్య యాదవ్‌

స్వయంగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌

ఉప ఎన్నిక వేళ కీలక పరిణామం  

గజ్వేల్‌: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక వేడి ఊపందుకున్న వేళ మంగళవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వేదికగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సాగర్‌ నుంచి బీజేపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ అసంతృప్త నేత కడారి అంజయ్య యాదవ్‌ వందలాది మంది అనుచరులతో సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు బీజేపీ సీనియర్‌ నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, బాబురావు నాయక్, బొల్లి రాంచంద్రం, లింగాల పెద్దన్న తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్‌ వారికి స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం కడారి అంజయ్య విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నాయకత్వం యాదవులను విస్మరించేలా కుట్రలు చేయడం తనకు నచ్చలేదన్నారు. టీఆర్‌ఎస్‌లో శ్రీనివాస్‌ యాదవ్‌ను మంత్రిగా నియమించడం, లింగయ్య యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశమివ్వడం, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తర్వాత ఆయన కుమారుడు భగత్‌కు టికెట్‌ ఇవ్వడం యాదవులపట్ల టీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధిని తెలియ జేస్తోందన్నారు.

బీజేపీలో యాదవులను అణచివేసే ధోరణి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోనే సమస్యలను పరిష్కరించు కోగలుగుతామన్న నమ్మకంతోనే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ప్రకటించారు. సాగర్‌లో నోముల భగత్‌ ఘన విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. టెయిల్‌ పాండ్‌ ప్రాజెక్టు, డిగ్రీ కళాశాల, రోడ్లు, మౌలికవసతుల కల్పనకు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు కడారి వివరిం చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, రవీంద్రకుమార్‌ తదిరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు