Kalyana Lakshmi: కళ్యాణలక్ష్మి: కాసులిస్తేనే.. ‘కానుక’!

13 Dec, 2021 11:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆడబిడ్డ సొమ్ముకూ కక్కుర్తి!

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమల్లో కమీషన్ల పర్వం

పరిశీలన మొదలు మంజూరు దాకా వసూళ్ల తంతు

పారదర్శకత పేరిట తెచ్చిన ఆన్‌లైన్‌ విధానం సరిగా అమలుకాని తీరు

మ్యాన్యువల్‌ పరిశీలన, మధ్యవర్తుల ప్రమేయంతో అక్రమాలకు ఊతం

నిధుల విడుదలలో జాప్యం చేస్తున్న ప్రభుత్వం

పెళ్లి సమయంలో అందాల్సిన ఆర్థిక సాయం.. నెలలు గడిచినా అందని వైనం

పేదింటి ఆడబిడ్డల పెళ్లి ఆ కుటుంబాలకు భారం కాకూడదన్న ఉదాత్త లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటిని పారదర్శకంగా అమలు చేసేందుకు ఆన్‌లైన్‌ విధానాన్నీ ప్రవేశపెట్టింది. కానీ కొందరు అధికారులు, సిబ్బంది మాత్రం ఆడబిడ్డలకు అందే ఆర్థికసాయంలోనూ కక్కుర్తిపడుతున్నారు. చేయి తడిపితేనే పనవుతుందంటూ వసూళ్లకు తెగబడుతున్నారు.

ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల దాకా కమీషన్ల రూపంలో దండుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు దళారులుగా మారి కమీషన్లు తీసుకుంటున్నారు. ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఇలాంటి వాస్తవాలెన్నో బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని వెల్లడైంది. దీనిపై ప్రత్యేక కథనం. -చిలుకూరి అయ్యప్ప

నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన శ్రీలత (పేరుమార్చాం) కల్యాణలక్ష్మి పథకం కోసం మీసేవ కేంద్రంలో రూ.150 చెల్లించి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు ప్రింటవుట్‌తోపాటు ఇతర ఆధారాలు, జిరాక్సు పత్రాలతో కూడిన ఫైల్‌ను మండల కార్యాలయంలో సమర్పించాలని సదరు మీసేవ నిర్వాహకుడు సూచించాడు. అదే తనకు రూ.500 ఇస్తే ఫైల్‌ను నేరుగా సంబంధిత అధికారులకు చేరుస్తానని.. మీరు వెళితే జాప్యం అవుతుందని చెప్పాడు. దీనితో శ్రీలత సదరు మీసేవ నిర్వాహకుడికి రూ.500 ఇచ్చింది.

తర్వాత ఒకరిద్దరు మధ్యవర్తులు శ్రీలత తల్లిదండ్రులను సంప్రదించారు. తహసీల్దార్‌ ఆఫీసులో పనిత్వరగా కావాలన్నా, దరఖాస్తు ఆమోదం పొందాలన్నా రూ.5వేలు ఖర్చవుతుందని గాలం వేశారు. చేసేదేమీ లేక శ్రీలత తల్లిదండ్రులు డబ్బులు కట్టారు. తర్వాత పరిశీలన, విచారణ వారం, పదిరోజుల్లో పూర్తయ్యాయి. కొద్దిరోజుల తర్వాత చెక్కు జారీ అయిందని, దానికి రూ.2 వేలు ఖర్చవుతుందని మధ్యవర్తులు మళ్లీ ఫోన్‌ చేశారు. డబ్బులు చెల్లించాక కొద్దిరోజులకు కల్యాణలక్ష్మి సొమ్ము చేతికి అందింది.

నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌కు చెందిన షాహీన్‌ (పేరుమార్చాం) షాదీ ముబారక్‌ పథకం కింద మీసేవ కేంద్రంలో దరఖాస్తు సమర్పించింది. తర్వాత షాహీన్‌ తల్లి సదరు దరఖాస్తు, ఇతర ఆధారాలను స్థానిక ప్రజాప్రతినిధి భర్తకు ఇచ్చి ఆర్థిక సాయం త్వరగా వచ్చేలా చూడాలని కోరింది. ఆయన మున్సిపల్‌ అధికారులు, ఆర్డీవో కార్యాలయంలోని అధికారులకు ‘చెయ్యి తడిపితే’నే పనవుతుందంటూ రూ.10 వేలు వసూలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత దరఖాస్తు పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాయని చెప్పాడు. దాదాపు ఆరేడు నెలల తర్వాత షాదీముబారక్‌ నగదు బ్యాంకు ఖాతాలో జమ అయింది.

పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయంలోనూ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధుల కాసుల కక్కుర్తికి ఈ రెండూ చిన్న ఉదాహరణలు. అక్కడ ఇక్కడ అని కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు సరిగా విడుదలకాక లబ్ధిదారులకు సొమ్ము అందడంలో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. అప్పోసొప్పో చేసి ఆడపిల్లలకు పెళ్లి చేసిన తల్లిదండ్రులు.. ప్రభుత్వ సాయం ఎప్పుడు అందుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారంపై బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులను సంప్రదించగా సరిగా స్పందించలేదు. నిధులు త్వరలోనే విడుదలవుతాయని, లబ్ధిదారులందరికీ సాయం జమ అవుతుందని మాత్రం పేర్కొన్నారు.

అందిన చోటల్లా వసూళ్లే..
అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల్లో వసూళ్లకు తెగబడుతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నుంచి.. పత్రాల సమర్పణ, పరిశీలన, విచారణ, చెక్కుల మంజూరు దాకా.. ఒక్కోదశలో ఒక్కొక్కరు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. చాలాచోట్ల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాక నేరుగా తహసీల్దార్‌ కార్యాలయంలో ఇవ్వకుండా.. స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయించాల్సి వస్తోంది. నేరుగా వెళితే పథకం సొమ్ము రాదంటూ దరఖాస్తుదారులను భయపెడుతుండటమే దీనికి కారణం.

స్థానిక ప్రజాప్రతినిధులు తమవద్దకు వచ్చినవారి దరఖాస్తులను సంబంధిత కార్యాలయానికి పంపుతున్నారు. తర్వాత ఫైళ్ల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ, మంజూరు సమయంలో అధికారులు, సిబ్బందికి ఇవ్వాలంటూ.. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని.. ఎవరివాటా వారికి ఇచ్చి, తామూ కొంత తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా ఒక్కో దరఖాస్తుదారు వద్ద రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది.

ఒక్కచోటే 86లక్షలుమింగేశారు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల విషయంగా విజిలెన్స్‌ అధికారులు చేసిన పరిశీలనలో దిమ్మతిరిగే అంశాలను గుర్తించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తుల పరిశీలన, ప్రాసెసింగ్‌ విషయంలో.. ఆదిలాబాద్‌ రెవెన్యూ డివిజినల్‌ అధికారి (ఆర్డీవో) కార్యాలయంలోని ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ ఏకంగా రూ.86,09,976  దారి మళ్లించినట్టు గుర్తించారు. దీనిపై గుడిహత్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. సదరు సీనియర్‌ అసిస్టెంట్‌ను అరెస్టు చేశారు.

ఇది కేవలం ఒక్క ఆదిలాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అక్రమాల లెక్క మాత్రమే. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ ఈ తరహా అక్రమాలు భారీగా చోటు చేసుకున్నట్టు విజిలెన్స్‌ వర్గాలు చెప్తున్నాయి.

వివాహ ధ్రువీకరణ పత్రం జారీలోనూ..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తులకు కులధ్రువీకరణ పత్రంతోపాటు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జత చేయాలి. కుల ధ్రువీకరణ పత్రం జారీ సాధారణంగానే జరుగుతున్నా.. వివాహ ధ్రువీకరణ పత్రం కోసం వసూళ్లు సాగుతున్నాయి. స్థానిక సంస్థలు, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కులధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి వీలుంది. అయితే 95 శాతం మంది స్థానిక సంస్థల నుంచే పత్రాలను తీసుకుంటున్నారు. పంచాయతీల పరిధిలో కార్యదర్శి, మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లు వాటిని జారీ చేస్తున్నారు. ఈ సమయంలో రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్టు జనాలు చెప్తున్నారు.

ఆన్‌లైన్‌.. పేరుకే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను పూర్తి పారదర్శకతతో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకొచ్చింది. అర్హత ఉన్న లబ్ధిదారులు ఈపాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు. దానిపై అవగాహన లేనివారు సమీపంలోని మీసేవ కేంద్రంలో సర్వీసు చార్జీలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుతోపాటు ఆధారాలను స్కాన్‌చేసి అప్‌లోడ్‌ చేయాలి.

కానీ చాలాచోట్ల మ్యాన్యువల్‌గా సమర్పించిన దరఖాస్తులనే అధికారులు, సిబ్బంది పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి.. మ్యాన్యువల్‌గా సమర్పించని వారి అర్జీలను నిర్దేశించిన గడువు తర్వాత తిరస్కరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మ్యాన్యువల్‌గా పత్రాల సమర్పణపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వకున్నా.. రెవెన్యూ అధికారులు, పరిశీలన సిబ్బంది అత్యుత్సాహం తీవ్ర గందరగోళానికి దారితీస్తోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. 
 

మరిన్ని వార్తలు