Omicron: ‘నాన్‌ రిస్క్‌’ నుంచే రిస్క్‌!

16 Dec, 2021 10:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వ్యూహంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయాల్లో కేవలం రిస్క్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎక్కువగా దృష్టి పెట్టి పరీక్షలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో నమోదైన మూడు ఒమిక్రాన్‌ కేసులూ నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చినవే కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రయాణికుల విషయంలో తీసుకోవల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది. రిస్క్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు చేయాలని, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్‌గా పరీక్షలు చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల ఒకటో తేదీ నుంచి ఆ మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి.

11 దేశాలను రిస్క్‌ కేటగిరీ కింద గుర్తించారు. ఇందులో జర్మనీ, ఫ్రాన్స్, కెనడాతో పాటు యూఎస్, యూకే తదితర దేశాలున్నాయి. ఆయా దేశాల నుంచి వచ్చిన అందరు ప్రయాణికులకు, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ర్యాండమ్‌గా శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిస్క్‌ దేశాల నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలిన వారి నమూనాల్లో ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నారు.

వారిని విమానాశ్రయం నుంచి నేరుగా టిమ్స్‌కు తరలిస్తున్నారు. నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వారి నుంచి (2 శాతం) కేవలం నమూనాలు సేకరించి ఆర్టీపీసీఆర్‌ ఫలితం రాకముందే పంపేస్తున్నారు. ఇలా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 7,018 మందికి కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో నాన్‌ రిస్క్‌ దేశాలకు చెందిన వారు 1,622 మంది ఉన్నారు. ఈ విధంగా నిర్దేశించిన 2 శాతం కంటే ఎక్కువగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరీక్షలు చేసింది. ఈ క్రమంలోనే తొలిసారిగా 3 ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూశాయి.  

అందరినీ పరీక్షించాలి
రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బయటపడడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రిస్క్, నాన్‌ రిస్క్‌ దేశాలనే దానితో సంబంధం లేకుండా విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడిపైనా దృష్టిపెట్టి పరీక్షలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా నమోదైన మూడు కేసులు జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని అంటున్నారు.

అలాగే ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తున్న వారిని ఆర్టీపీసీఆర్‌ ఫలితం వచ్చేవరకు ఆపకుండా పంపించేయడం కూడా సమంజసం కాదని పేర్కొంటున్నారు. ఇలా పంపించేయ డం వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో బయట పడిన 3 కేసులు ఇందుకు నిదర్శనమని అంటున్నారు.   

చదవండి: శిక్షణలో ఉన్న యువతిపై ఇంజినీర్ల అసభ్య ప్రవర్తన

మరిన్ని వార్తలు