తెలంగాణ: ఆ మూడు జిల్లాలను కమ్మేస్తున్న కరోనా

28 Apr, 2021 08:05 IST|Sakshi

ప్రతి వంద టెస్టుల్లో 30 మందికి పాజిటివ్‌ 

తాజాగా గ్రేటర్‌ జిల్లాల్లో 2812 కేసులు నమోదు 

సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరంపై కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా నమోదువుతున్న పాజిటివ్‌ కేసుల్లో 1/3 వంతు కేసులు కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే నమోదువుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 10122 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..కేవలం మూడు జిల్లాల్లోనే రికార్డు స్థాయిలో 2812 నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసులతో పాటు కోవిడ్‌ మరణాలు కూడా అంతకంతకు పెరుగుతుండటం గ్రేటర్‌ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిస్తున్న కోవిడ్‌ బులెటిన్‌లో 20 నుంచి 60 మంది చనిపోయినట్లు వెల్లడిస్తుండగా..కేవలం గాంధీ, టిమ్స్‌ ఆస్పత్రుల్లోనే రోజుకు సగటున 100 నుంచి 120 మంది చనిపోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

ప్రతి వందలో 30 శాతం పాజిటివ్‌ 
ప్రస్తుతం మూడు జిల్లాల పరిధిలో 284 ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేస్తున్నారు. ఒక్కో సెంటర్‌లో రోజుకు సగటున 50 నుంచి 100 మందికి పరీక్షలు చేస్తున్నారు. ఇలా టెస్టు చేసిన ప్రతి వంద మందిలో 30 శాతం మందికిపైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ఇక 20 ప్రభుత్వ, 60 ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌లో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్నారు. వీటిలో రోజుకు సగటున 18 వేల నుంచి 25 వేల పరీక్షలు చేస్తున్నారు. ఈ ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లోనూ ఇదే స్థాయిలో పాజిటివ్‌ కేసులు రికార్డు అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి మించి కిట్లు లేక పోవడంతో పరీక్షల కోసం ఆశతో వచ్చిన వారు నిరాశతో వెనుదిరగాల్సి వస్తుంది. ఇక ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌ రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా వసూలు చేస్తుండటమే కాకుండా కొన్ని సెంటర్లు ఏకంగా రిపోర్ట్‌ ఇచ్చే సమయాన్ని బట్టి టెస్టులకు ధరలు నిర్ణయిస్తున్నాయి.  
 
టీకా కోసం పోటెత్తుతున్న జనం 
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 179 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్‌ టీకాలు వేస్తుండగా, మరో 150 ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టీకా కార్యక్రమం కొనసాగుతోంది. జనవరి 16న కోవిడ్‌ టీకా కార్యక్రమం ప్రారంభం కాగా..ఇప్పటి వరకు మూడు జిల్లాల పరిధిలో 18 లక్షల మందికి టీకాలు వేశారు. ప్రస్తుతం నగరంలో కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో సిటీజనులు టీకాల కోసం ఎగబడుతున్నారు. ఉదయం ఏడు గంటలకే ఆయా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. వీరి నిష్పత్తికి తగినంత నిల్వలు ఆరోగ్య కేంద్రాల్లో లేకపోవడంతో వారంతా నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. కొంత మంది వైద్య సిబ్బంది దీన్ని అవకాశంగా తీసుకుని, వ్యాక్సిన్‌ను పక్కదారి పట్టిస్తున్నారు. సెకండ్‌ డోస్‌ కోసం వచ్చిన వారికి కేటాయించిన టీకాలను బంధువులు, ఇతరులకు వేస్తున్నారు. ఇందుకు రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

కాల్‌ సెంటర్లకు తాకిడి 
కరోనా తీవ్రత నేపథ్యంలో చాలామంది వ్యాక్సిన్‌ వేసుకునేందుకు  ఎదురు చూస్తుండగా, కరోనా కారణంగా మరణించిన వారి సంబంధీకులు దహన సంస్కారాలు, అంబులెన్సులకు సంబంధించిన సమాచారం కావాలని జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేస్తున్నారు. ఈనెల ఒకటోతేదీనుంచి ఇప్పటి వరకు కోవిడ్‌కు సంబంధించి 563 కాల్స్‌ రాగా, వాటిల్లో 133 కోవిడ్‌ కిట్స్‌కు సంబంధించినవి, 292 వ్యాక్సినేషన్‌ కేంద్రాల సమాచారం కోసం చేసినవి. కోవిడ్‌తో మరణించిన వారి దహన సంస్కారాలు ఎక్కడ చేయాలి..మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సులు దొరుకుతాయా వంటి సమాచారం కోసం 43 కాల్స్‌ వచ్చినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. 

( చదవండి: కరోనా పీడ విరగడయ్యేది అప్పుడేనా..?

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు