తెలంగాణలో కరోనా కలవరం.. తీవ్రంగా సెకండ్‌వేవ్‌

11 Apr, 2021 00:12 IST|Sakshi

ఒక్క రోజులో ఏకంగా 2,909 కేసులు 

రాష్ట్రంలో మరోసారి రికార్డు స్థాయిలో కేసులు  

గతేడాది కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఆగస్టు 25న 3,018 కేసులు 

రికార్డు స్థాయిలో 1.11 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు 

అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 487 పాజిటివ్‌ కేసులు 

రాష్ట్రంలో ఇప్పటికి 1.08 కోట్ల పరీక్షలు.. 3.24 లక్షల కేసులు 

కోలుకున్నవారు 3.04 లక్షలు.. మొత్తం మరణాలు 1,752 

18.99 లక్షలకు చేరుకున్న కరోనా వ్యాక్సినేషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. ఒక్క రోజులో ఏకంగా మూడు వేలకు చేరువలో కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మొదటి వేవ్‌లో భాగంగా గతేడాది ఆగస్టు 25వ తేదీన అత్యధికంగా 3,018 కేసులు నమోదైతే, ఈసారి ఆ రికార్డుకు చేరువలో సెకండ్‌వేవ్‌లో కేవలం రెండు నెలల్లోనే శుక్రవారం 2,909 కేసులు నమోదయ్యాయి. ఇది తీవ్ర ఆందోళనకు గురి చేసే అంశమని వైద్య నిపుణులు అంటున్నారు. మొదటివేవ్‌ పీక్‌లోకి రావడానికి ఆరేడు నెలలు పడితే, సెకండ్‌వేవ్‌ ఆ స్థాయికి చేరుకోవడానికి 2 నెలలు కూడా పట్టలేదు. ము న్ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. మరోవైపు కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకుంటున్నవారి సంఖ్య ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు శనివారం ఉదయం కరోనా బులెటిన్‌ విడుదల చేశారు.

ఈ బులెటిన్‌ ప్రకారం శుక్రవారం ఒక్క రోజులో 1,11,726 పరీక్షలు చేయగా, 2,909 కేసులు నమోదు అయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 1,08,73,665 పరీక్షలు చేయగా, అందులో 3,24,091 మంది కరోనా బారినపడ్డారు. కాగా ఒక్క రోజులో 584 మంది కోలు కోగా, ఇప్పటివరకు 3,04,548 మంది రికవరీ అ య్యారు. ఒక్క రోజులో ఆరుగురు చనిపోగా, ఇప్పటివరకు మొత్తం 1,752 మంది కరోనాతో మరణించారు. రికవరీ రేటు 93.96 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ప్రస్తుతం 17,791 యాక్టివ్‌ కేసులు ఉండగా, అందులో ఇళ్లు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల ఐసోలేషన్‌లో 11,495 మంది ఉన్నారని ఆయన తెలిపారు. కాగా, ఒక్క రోజులో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 487 కేసులు నమోదు కాగా, మేడ్చల్‌ జిల్లాలో 289, రంగారెడ్డి జిల్లాలో 225, నిజామాబాద్‌ జిల్లాలో 202 కేసులు నమోదు అయ్యాయి.  

పురుషులపైనే ఎక్కువ ప్రభావం.. 
కరోనా వైరస్‌ మగవారిపైనే ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఇంటి బయట ఎక్కువ సమయం ఉండటం, మహిళల కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు, ఇతర పనులు పనిచేయడం తదితర కారణాలతో పురుషుల్లోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.24 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, అందులో 61.5 శాతం మం ది పురుషులు, 38.5 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది. 21–30 ఏళ్ల వయసులోని పురు షుల్లో 13.4 శాతం మంది కరోనాకు గురికాగా, అదే వయసు మహిళల్లో 8.2 శాతం మంది వైరస్‌ బారినపడ్డారు. 31–40 ఏళ్ల వయసు పురుషుల్లో 14.2 శాతం, మహిళల్లో 7.4 శాతం మంది ఉన్నారు.

18.99 లక్షలకు చేరుకున్న వ్యాక్సినేషన్‌.. 
రాష్ట్రంలో ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేస్తున్నారు. శుక్రవారం ఈ వయసులోని 1,06,732 మందికి మొదటి డోస్‌ టీకా వేయగా, 6,119 మందికి రెండో డోస్‌ టీకా వేశారు. ఈ స్థాయిలో టీకాలు వేయడం రికార్డు అని శ్రీనివాసరావు తెలిపారు. ఇదిలా ఉంటే జనవరి 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొదటి డోస్‌ తీసుకున్నవారు 16,08,358 మంది కాగా, రెండో డోస్‌ తీసుకున్నవారు 2,90,652 మంది ఉన్నారు. అంటే మొత్తం మొదటి, రెండో డోస్‌ టీకాలు వేసుకున్నవారి సంఖ్య 18,99,010 చేరింది. కాగా, 2.92 శాతం వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయని శ్రీనివాసరావు తెలిపారు.  

వ్యాక్సిన్‌ నిల్వలు మరో 3 రోజులకే 
తక్షణమే 30 లక్షల డోసులు పంపాలని కేంద్రానికి సీఎస్‌ లేఖ   
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడు రోజులకు సరిపడ కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు మాత్రమే ఉన్నాయి. శనివారం నాటికి మిగిలి ఉన్న 5.66 లక్షల డోసులు మరో మూడు రోజులకు సరిపోనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తూ, తక్షణమే రాష్ట్రానికి మరో 15 రోజులకు సరిపడ 30 లక్షల వ్యాక్సిన్‌ డోసులను పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శనివారం కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను ఉధృతం చేశామని, శుక్రవారం రోజు 1.15 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని తెలి పారు. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్‌ను రోజుకు 2 లక్షలకు పెంచనున్నామని లేఖలో వివరించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు