సిబ్బంది మధ్య వార్‌.. నిలిచిపోయిన కరోనా పరీక్షలు..

30 Apr, 2021 13:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బన్సీలాల్‌పేట్‌(సికింద్రాబాద్‌): సికింద్రాబాద్‌ బోయిగూడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది మధ్య కోల్డ్‌వార్‌ సాగుతుంది. రోగులకు సేవలందించే విషయంలో సిబ్బంది మధ్య సమన్వయం కొరవడడంతో కరోనా రోగులకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో గురువారం కరోనా పరీక్షలకు కొంత అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటి రంగంలోకి దిగి స్వయంగా పీపీఈకిట్‌ వేసుకొని కరోనా పరీక్షలు నిర్వహించారు. 

వైద్యాధికారి, సిబ్బంది మధ్య అంతర్గత పోరు... 
బోయిగూడ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో వైద్యాధికారిణి, స్టాఫ్‌ మధ్య వైద్య సేవల విషయంలో కొంత కాలం నుంచి అంతర్గత పోరు కొనసాగుతుంది. సెంటర్‌లో పలువురు సిబ్బంది వైద్యాధికారిణి డాక్టర్‌ ఆశాజ్యోతి చెప్పిన మాట వినకుండా ఎదురు తిరుగుతున్నట్లు సమాచారం. వీరి మధ్య విబేధాలు గురువారం ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. సెంటర్‌లో కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ టెక్నీషియన్, స్టాఫ్‌ నర్సుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.

దీంతో సదరు సిబ్బంది గురువారం విధులకు రాలేదు. దీంతో సెంటర్‌ వైద్యాధికారిణి డాక్టర్‌ ఆశాజ్యోతి కరోనా పరీక్షలు చేయాల్సిందిగా ఏఎన్‌ఎంను ఆదేశించారు. శిక్షణ లేకుండా తాము ఏ విధంగా పరీక్షలు నిర్వహించాలని, ఫర్మనెంట్‌ స్టాఫ్‌ను పిలిపించి పరీక్షలు నిర్వహించాలని సిబ్బంది బదులిచ్చినట్లు సమాచారం. వైద్యాధికారణి, సిబ్బందికి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. 

పరీక్షలు చేసిన డీఎంహెచ్‌ఓ.. 
వైద్యాధికారిణి డాక్టర్‌ ఆశాజ్యోతి సిబ్బందితో వాగ్వాదం జరిగిన విషయాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటి దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన బోయిగూడ సెంటర్‌కు వచ్చి అక్కడ పరీక్షల కోసం నిరీక్షిస్తున్న ప్రజలను చూసి చలించిపొయాడు. వెంటనే డాక్టర్‌ వెంకటి పీపీకిట్‌ ధరించి సాయంత్రం వరకు కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో అక్కడున్న ప్రజలు జిల్లా వైద్యాధికారి తీరును చూసి సంతోషం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు