Vaikuntha Ekadashi: ఉత్తర ద్వార దర్శనం లేదు 

12 Jan, 2022 08:33 IST|Sakshi

సాక్షి, నల్లకుంట (హైదరాబాద్‌): ఈ నెల 13న (గురువారం) ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేవాదాయ కమిషనర్‌ ఆదేశాల మేరకు ముక్కోటి ఏకాదశి రోజున న్యూ నల్లకుంటలోని  సీతారామాంజనేయ సరస్వతీదేవి ఆలయంలో ఉత్తరద్వార దర్శనం ఉండదని ఆలయ ఈవో శ్రీధర్‌ తెలిపారు. స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు చేయించాలనుకునే భక్తులు ఆలయ గుమస్తా వద్ద టికెట్టు తీసుకుంటే వారు భక్తుల గోత్ర నామాలపై పూజలు నిర్వహిస్తారని ఈవో తెలిపారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆలయాల్లో తీర్థ, ప్రసాద వితరణ కూడా నిషేధమని చెప్పారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తులు కూర్చోవడానికి కూడా అనుమతి లేదని తెలిపారు. వైరస్‌ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు భక్తులు సహకరించాలని సూచించారు.

భక్తులకు అనుమతి లేదు.. 
జగద్గిరిగుట్ట: రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో జగద్గిరిగుట్టలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 13న వైకుంఠ ఏకాదశి, 14న గోదాదేవి కల్యాణం నేపథ్యంలో భక్తులకు దర్శనములు నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ ఆదేశానుసారం శాస్త్రోయుక్తంగా కేవలం వేద పండితులు, సిబ్బంది సమక్షంలో అంతరంగికంగా వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.   

చదవండి: కరోనా థర్డ్‌ వేవ్.. వైరస్‌ పడగలో వీఐపీలు

మరిన్ని వార్తలు