తల్లులు ఇళ్లలో... తనయులు పొలాల్లో..! 

20 May, 2021 09:06 IST|Sakshi

ట్రాక్టర్‌ కింద.. చెట్టు నీడన గడుపుతున్న రెండు కుటుంబాలు 

కరోనా సోకిన చిన్న ఇళ్లలో వసతుల్లేక అవస్థలు 

బాధితులకు సహకరించనిగ్రామస్తులు 

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో వెలుగుచూసిన వైనం

వర్ధన్నపేట: కలిసిమెలిసి ఉంటున్న కుటుంబసభ్యులను కరోనా చెట్టుకొకరు, పుట్టకొకరుగా చేస్తోంది. అసలే చిన్న ఇళ్లు కావడంతో వసతుల్లేక తల్లులను ఇళ్లలో ఉంచి తనయులు పొలాల్లో తలదాచుకోవ్సాలిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ కరోనా సోకిన ఇంట పరిస్థితి. వివరాలు... వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బోయిన వెంకటలక్ష్మికి వారం క్రితం కరోనా సోకింది. దీంతో బయటకు రావొద్దని ఆ కుటుంబసభ్యులను గ్రామస్తులు కట్టడి చేశారు. కానీ, వారిది చిన్న ఇల్లు కావడం, లోపల విడివిడిగా ఉండే అవకాశం లేకపోవడం కష్టంగా మారింది. దీంతో తల్లి వెంకటలక్ష్మిని అదే ఇంట్లో ఉంచిన ఆమె కుమారుడు రాజ్‌కుమార్‌ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయాడు. అక్కడ ట్రాక్టర్‌నే ఇంటిగా మార్చుకొని నివాసముంటున్నాడు.

ఇదే గ్రామానికి చెందిన బుస్స సారమ్మకు సైతం కరోనా సోకింది. దీంతో ఆమెను ఇంట్లోనే ఉంచి ఆమె కుమారుడు ఎల్లస్వామి, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి గ్రామసమీపంలోని మామిడి తోటలో జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయమై బుధవారం బాధితులను ఆరా తీయగా తమ ఇళ్లలో మరుగుదొడ్డి ఒకటే ఉండటం, ఇళ్లు చిన్నవి కావడంతో తమ తల్లులను అక్కడే ఉంచి పొలాల్లో తలదాచుకుంటున్నామని తెలిపారు. అయితే, వర్ధన్నపేటలో ఐసోలేషన్‌ కేంద్రం ఉన్నట్లుగా వీరికి సమాచారం లేకపోవడం గమనార్హం.  

చదవండి: మంచె మీదే బీటెక్‌ విద్యార్థి ఐసోలేషన్‌.. చెట్టుపైనే

మరిన్ని వార్తలు