ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆర్థిక శాఖ?

7 Dec, 2023 10:34 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. అందులో తొమ్మిది నుంచి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు గాంధీ భవన్‌ వర్గాల ద్వారా తెలిసింది. వారిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉండనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రుల శాఖల కేటాయింపుపై ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేయనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఉత్తంకుమార్‌ రెడ్డికి ఆర్థిక శాఖ అప్పగించనున్నట్లు తెలిసింది. సీనియర్‌ నాయకులైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన వారు కావడంతో వారి సీనియారిటీకి ప్రాధాన్యం ఇచ్చారు. 

రాజగోపాల్‌రెడ్డికి మరో పదవి
మునుగోడు నుంచి రెండోసారి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆయనకు మంత్రి పదవి లేదంటే మరేదైనా ప్రాధాన్యం కలిగిన పదవిని ఇచ్చే అవకాశం ఉంది. 

నేడు ప్రమాణ స్వీకారోత్సవం
ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 11 మంది కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. గురువారం తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన మంత్రివర్గంలో నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు చోటు దక్కింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో మొదటిసారి ఐటీ, క్రీడలు, యూత్, కమ్యూనికేషన్లు, ఓడరేవులు, విమానశ్రయాలు, సహజవాయువు పరిశ్రమలకు మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలోనూ మంత్రిగా పనిచేశారు.

ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ తరువాత జిల్లా నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవికి అవకాశం కల్పించారు. ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో ఉత్తమ్‌ పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వీరిద్దరూ మంత్రులుగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో జిల్లా నుంచి మాజీ మంత్రులు ఇద్దరికి ఇప్పుడు మంత్రి పదవులు దక్కాయి. 

>
మరిన్ని వార్తలు