అనారోగ్యంతో హోంగార్డు మృతి..

15 Aug, 2020 07:59 IST|Sakshi
గణేష్‌ (ఫైల్‌)

శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆసుపత్రిలో చికిత్స.. 

కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా రిపోర్టు.. 

సంతాపం తెలిపిన కుషాయిగూడ పోలీసులు..  

బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా  ఆదుకుంటామన్న ఇన్‌స్పెక్టర్‌.. 

కుషాయిగూడ: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందాడు. కీసరలో నివసించే  ఎం.గణేష్‌ (30) అనే హోంగార్డ్‌ ఈ నెల 3న కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో చేరాడు. మొబైల్‌ వాహనం నడుపుతున్న గణేష్‌ విధుల్లో చేరిన ఐదు రోజులకే అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఈ నెల 8న స్టేషన్‌లో రిపోర్టు చేసి ఇంటి వద్దే ఉన్న ఆయనకు 10న శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. 

దీంతో ఈసీఐఎల్‌లోని జీనియా ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. తన ఆరోగ్య పరిస్థితిని స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌కు తెలిపి సెలవు తీసుకున్నాడు. తిరిగి శుక్రవారం సాయంత్రం మరోసారి ఆయనకు  శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో జీనియా ఆసుపత్రికి వెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడకూడా వైద్యులు అదే సలహా ఇచ్చారు. దీంతో మెరుగైన వైద్యం కోసం మలక్‌పేట్‌ యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ నెల 10 చర్లపల్లిలోని వింటాల్యాబ్, 12న రాచకొండ సీపీ కార్యాలయంలో కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్‌గా రిపోర్టు వచ్చినట్లు తెలిపారు. మృతుడికి భార్య, రెండున్నర సంవత్సరాల కూతురు, ఏడాది వయసున్న పాప ఉన్నారు. గణేష్‌ మృతిపట్ల కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్, సిబ్బంది సంతాపం తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు.  

మరిన్ని వార్తలు