మళ్లీ ఆకలి కేకలు!

28 Jul, 2020 08:22 IST|Sakshi

ఖైరతాబాద్‌ లోని ఒక స్టార్‌ హోటల్‌కు కస్టమర్ల ఆదరణ లేక నిర్వహణ భారంతో సదరు యాజమాన్యం కొంతమంది ఉద్యోగులు, సిబ్బందికి ఉద్వాసన పలికింది. దీంతో ఇతర పనులూ లేక వారి కుటుంబ పోషణ భారంగా తయారైంది. దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. వారు స్వస్థలాలకు వెళ్లలేక... ఇక్కడ ఉండలేక తిండి గింజలకు తల్లడిల్లున్నారు. ఇలా కరోనా కష్ట కాలంలో ఉపాధి కోల్పోయి ఆకలి కేకలు పెడుతున్న కుటుంబాలు నగరంలో 
అనేకం. 

సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు ఆకలి కేకలు పెడుతున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కరువై తిండి గింజలు లభించక... సుమారు 20 లక్షల వలస కార్మికులు మహానగరం దాటి సొంతూళ్లకు వెళ్లిపోయారు. లాక్‌డౌన్‌ అన్‌లాక్‌గా మారినా.. కరోనా ప్రభావంతో వర్క్‌ ఆర్డర్స్, బిజినెస్‌ లేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మొదలుకొని స్థానిక కార్మికుల వరకు ఆయా వృత్తుల నుంచి ఉద్వాసనలకు గురవుతున్నారు. ఉపాధి కోల్పోయి ఇక్కడ ఉండి వేరే పని చేయలేక... సొంతూళ్లకు వెళ్లలేక తల్లడిల్లుతున్నారు. నెలసరి రూ. ఆరు వేలు మొదలుకొని రూ. లక్ష వరకు వేతనాలున్న ఎందరో ఉపాధి కోల్పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. సాఫ్ట్‌వేర్‌.. ఇటీ రంగాలకు వర్క్‌ ఆర్డర్‌లు లేక ఆయా రంగాలు దివాలా దిశగా పయనిస్తున్నాయి.

ఇక పరిశ్రమలకు వర్క్‌ ఆర్డర్, ముడి సరుకు కొరతతో పరిస్థితి అంతంత మాత్రంగా మారగా, భవన నిర్మాణ రంగం పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అనే చందంగా తయారయ్యాయి. పర్యాటక రంగం, హోటల్‌ ఇండస్ట్రీ, రెస్టారెంట్స్‌కు కనీస ఆదరణ లేక షట్‌డౌన్‌ దిశవైపు అడుగులేస్తున్నాయి. రవాణా రంగానికి డిమాండ్‌ లేకుండా పోయింది. ప్యాకేజింగ్, ఆహార శుద్ధి, ఫుట్‌ వేర్, రబ్బర్, ప్లాస్టిక్, ఆటో మొబైల్,  వస్త్రాలు, బ్యాంగిల్స్‌ తదితరాల వ్యాపారాలూ ముందుకు సాగడం లేదు.  కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. దీంతో అన్ని రంగాల లావాదేవీలు పడిపోయాయి. ఇక బయట కొనుగోళ్లంటేనే  హడలిపోతున్నారు. దీంతో కనీసం అద్దె కూడా సర్దుబాటు కాని పరిస్థితులు దాపురించాయి. 

హోటల్స్‌ షట్‌డౌన్‌... 
హోటల్‌ ఇండస్ట్రీ షట్‌డౌన్‌ దిశగా పరుగులు తీస్తోంది. కరోనా ధాటికి హోటల్‌ రంగం కుదేలైంది. లాక్‌డౌన్‌ సడలింపులో హోటల్స్‌ పునఃప్రారంభమైనా.. కస్టమర్ల నుంచి కనీస ఆదరణ లేకుండా పోయింది. పెద్ద పెద్ద హోటల్స్‌లో గదులకు ఎలాంటి డిమాండ్‌ లేక పోగా, ఫుడ్‌ పాయింట్స్‌లో కనీసం టేక్‌ అవేకి కూడా గిరాకీ లేకుండా పోయింది. నిర్వహణ తడిసిమోపెడవడంతో ఇప్పటికే పలు హోటల్స్‌ సిబ్బందిని  ఉద్వాసన పలికి మూసి వేయగా, మరి కొన్నికూడా ఆ దిశగా పయనిస్తున్నాయి. కనీసం భోజనం, టిఫిన్‌ సెంటర్లు కూడా నడవని పరిస్థితి నెలకొంది. దీంతో హోటల్స్‌ కార్మికులందరూ ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఇక స్టార్‌ హోటల్స్‌ తాత్కాలిక ఉద్యోగులు, సిబ్బందిని తొలగించి రెగ్యులర్‌ ఉద్యోగులను వేతనం లేని సెలవులను ఆగస్టు 30 వరకు పొడిగించాయి. 

తగ్గిన వర్క్‌ ఆర్డర్లు...
ఐటీ కంపెనీలకు కూడా వర్క్‌ ఆర్డర్లు లేక ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి. ఇప్పటికే సగానికి పైగా ఉద్యోగులను వర్క్‌ ఫ్రం హోం వెసులుబాటు కల్పించిన కంపెనీలు క్రమంగా ఉద్యోగులను వదిలించుకునే పనిలో పడ్డాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెస్తూ పని తీరుపై మెమోలు కూడా జారీ చేస్తుండగా, మరికొన్ని ఏకంగా వేతనాలు కూడా తగ్గించేస్తున్నాయి. ఇక మరికొన్ని కంపెనీలు అదనపు సిబ్బందికి ఉద్వాసన పలికే పనిలో పడ్డాయి. ప్రస్తుతం వర్క్‌ ఆర్డర్లు లేని కారణంగా వేతనం లేని దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడమా లేక.. స్వచ్ఛంద రాజీనామా చేయడమా అనే విషయాన్ని ఉద్యోగుల నిర్ణయానికే వదిలిపెడుతున్నాయి. దీంతో ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

దివాలా దిశగా ఆటోమొబైల్‌ రంగం  
కరోనా ఆటోమొబైల్‌ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. నగరంలో పలు ఆటో మొబైల్‌ పరిశ్రమలు తాత్కాలిక మూసివేత దిశకు చేరుకున్నాయి. ఇప్పటికే పలు పరిశ్రమలు ఉద్యోగులకు వేతనాలతో పాటు పనిదినాలనూ తగ్గించాయి. నగరంలోని ఒక ఆటో మొబైల్‌ పరిశ్రమ ఏకంగా లక్ష రూపాయల నుంచి 10 వేల వరకు వేతనాలు తీసుకునే వారికి ఒకే స్లాబ్‌ కింద నామమాత్రపు వేతనాలు ప్రకటించింది. కరోనా సంక్షోభం నుంచి బయటపడే వరకు ఈ వేతనాలపై పని చేయాలని ఆదేశించింది. ఇష్టం లేకపోతే ఉద్యోగం వదులుకోవచ్చని, అలాంటి వారికి తిరిగి అవకాశం ఉండదని నోటీసు జారీ చేసింది. దీంతో మొక్కుబడి వేతనాలపై ఉద్యోగం చేస్తుండటంతో కుటుంబాలు నడవడం కష్టంగా మారింది.  

మరిన్ని వార్తలు