ఇళ్ల ధరలకు రెక్కలు!

18 Aug, 2020 10:20 IST|Sakshi

మధ్యతరగతికి కలగా మారిన సొంతిళ్లు.. 

సిమెంటు, స్టీలు, కాంక్రీటు ధరల పెరుగుదల... 

లేబర్‌ ఛార్జీలు సైతం..

ఇళ్ల నిర్మాణాల్లో 70–80 శాతం వ్యయం ముడిసరుకులు, కూలీల ఖర్చులకే.. 

అపార్ట్‌మెంట్లు, ఇళ్ల ధరలు10–15 శాతం పెరుగుదల 

నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌ ఇండియా తాజా అంచనాలు 

సాక్షి, సిటీబ్యూరో: మహానగరం పరిధిలో ఇండిపెండెంట్‌గృహాల ధరలు ఇటీవలికాలంలో అమాంతం పెరిగాయి. దీంతో మధ్యతరగతి వేతన జీవులకు సొంతింటి కల దూరమవుతోంది. మహానగరం పరిధిలో ఇండిపెండెంట్‌ ఇళ్లు ,అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల ధరలు 10–15 శాతంపెరగడంతో సగటుజీవులకు ఇళ్ల కొనుగోలు భారంగా పరిణమించింది. నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌ ఇండియా తాజా అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం సిమెంటు, స్టీలు ధరలు అనూహ్యంగా పెరగడం, నగరంలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న లక్షలాదిమంది వలసకూలీలు సొంత రాష్ట్రాలకు తరలివెళ్లడంతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడం నిర్మాణరంగ సంస్థలకు తలకు మించిన భారంలాపరిణమించింది. ఈ నేపథ్యంలో  ధరలను పెంచక తప్పడంలేదని బిల్డర్లు వాపోతున్నారు.  

ధరల పెరుగుదలకు కారణాలివే.. 
⇒ ప్రస్తుతం సిమెంట్, స్టీలు, రీఇన్‌ఫోర్స్‌డ్‌ సిమెంట్‌కాంక్రీట్, శానిటరీ, ఎలక్ట్రికల్‌ విడిభాగాల ధరలు అనూహ్యంగా పెరగడంతో బిల్డర్లు ఇళ్ల ధరలను పెంచేస్తున్నారు. 
⇒ పలు రెడీమిక్స్‌ కాంక్రీటు ప్లాంట్లకు సిమెంటు, ఇసుక కొరత తీవ్రంగా ఉండడంతో సకాలంలో ఇంటి నిర్మాణాలకు కాంక్రీటు సరఫరా జరగడంలేదు. 
⇒ సిమెంట్‌ కంపెనీలకు సైతం కూలీల కొరత ఉండడంతో సిమెంటు ఉత్పత్తి తగ్గింది. దీంతో ధరలు కూడా భారీగా పెరిగాయి. ఉదాహరణకు కోవిడ్‌కంటే ముందు రూ.260కి లభించిన బస్తా సిమెంటు..ఇప్పుడు రూ.345 ధర పలకుతోంది.  
⇒ స్టీలు ధర కూడా టన్నుకు రూ.1000 మేర పెరిగినట్లు బిల్డర్లు చెబుతున్నారు. 
⇒ నగరంలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న యూపీ, బీహార్, రాజస్థాన్, ఒడిస్సా తదితర రాష్ట్రాలకు చెందిన వలసకూలీలు సొంత రాష్ట్రాలకు తరలివెళ్లడంతో లేబర్‌ కొరత తీవ్రంగా ఉంది. ఇప్పుడిప్పుడే నగరానికి కూలీలు చేరుకున్నప్పటికీ డిమాండ్‌కు సరిపడా కూలీలు అందుబాటులో లేరు. 
⇒  ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేబర్‌ ఛార్జీలు కోవిడ్‌ కంటే ముందు పరిస్థితితో పోల్చుకుంటే 25 శాతం అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. 
⇒ గతంలో ఒక రోజు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వారికి రూ.800 చెల్లిస్తే..ఇప్పుడు రూ.1000 నుంచి రూ.1200 వరకు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. 

భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం.. 
సాధారణంగా నిర్మాణ రంగంలో సిమెంటు, స్టీలు, ఇటుకలు, కలప, శానిటరీ, ఎలక్ట్రికల్‌ సామాను ధరలతోపాటు లేబర్‌ ఛార్జీలు 70–80 శాతం మేర ఉంటాయి. వీటి ధరలు ప్రస్తుతం అనూహ్యంగా పెరగడంతో ఈ ఏడాది చివరి వరకు ఇళ్ల ధరలు దిగివచ్చే అవకాశాలు లేవని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌ ఇండియా తాజా అధ్యయనంలో వెల్లడించింది. అయితే మన దేశంలోని ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో ధర వరకు కాస్త తక్కువేనని..పెరుగుదల కూడా అంతగా ఉండదని స్పష్టంచేసింది. మరోవైపు హైటెక్‌సిటీ, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా పరిధిలో కోవిడ్‌ టైమ్స్‌లోనూ భూముల ధరలు దిగిరాకపోవడంతో ఇళ్ల ధరల పెరుగుదలకు మరో కారణమని తెలిపింది. ఇక నగరంలో హైటెక్‌సిటీ, మాదాపూర్‌ ప్రాంతాల్లో చదరపు అడుగు నిర్మాణాలకు రూ.6500 నుంచి రూ.7000, గచ్చిబౌలిలో రూ.6000–6300, కొండాపూర్‌లో రూ.6200–6500, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో రూ.10,000–12000 మేర ధరలు పలుకుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది.  

ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవు
ప్రస్తుతం సిమెంట్, స్టీలు, శానిటరీ, ఎలక్ట్రికల్‌ విడిభాగాల ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో ఇళ్ల ధరలు తగ్గే అవకాశాలు లేవు. ధరలు పెంచడం అనివార్యమౌతోంది. మరోవైపు లేబర్‌ కొరత తీవ్రంగా ఉండడంతో నూతన ప్రాజెక్టులు చేపట్టే విషయంలో వెనుకంజవేస్తున్నాం. – కందాడి జైపాల్‌రెడ్డి. బిల్డర్‌ 

మరిన్ని వార్తలు