బ్యారేజీల వైఫల్యం తర్వాత చేసిందేంటి?

23 Mar, 2024 05:51 IST|Sakshi

డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ అనుసరించి చర్యలు తీసుకున్నారా? 

లోపాలున్నా నాణ్యత సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారు ?

ఎస్డీఎస్‌ఓ, ఓ అండ్‌ ఎం, క్వాలిటీ కంట్రోల్‌పై అయ్యర్‌ కమిటీ ప్రశ్నల వర్షం

ముగిసిన అయ్యర్‌ కమిటీ మూడు రోజుల పర్యటన

అడిగిన సమాచారమిచ్చాకే అత్యవసర పనులను సిఫారసు చేస్తామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు ఏర్పడిన తర్వాత డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ ప్రకారం తీసుకున్న చర్యలేంటి? ఏమైనా కమిటీలు వేసి, విచారణ జరిపారా? వైఫల్యానికి కారణాలను నిర్ధారించారా?.. అని స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (ఎస్డీఎస్‌ఓ)ను చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం నిపుణుల కమిటీ ఎస్డీఎస్‌ఓ, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం) అధికారులతో సమావేశమై బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీసింది.

2024 ముగిసే వరకు బ్యారేజీల నిర్వహణ నిర్మాణ సంస్థల చేతుల్లోనే ఉండటంతో వార్షిక మరమ్మతులపై ఎలాంటి నివేదికలు తమకు అందలేదని, బ్యారేజీల్లో లోపాలు ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బందీ నివేదించలేదని అధికారులు బదులిచ్చినట్టు తెలిసింది. బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులను కమిటీ ప్రశ్నించింది. డిజైన్లు, డ్రాయింగ్స్‌ను అనుసరించి పనులు చేశారా? మధ్యలో ఏమైనా మార్పులు చేశారా? అని కమిటీ అడగ్గా, డిజైన్ల ప్రకారమే నిర్మించినట్టు అధికారులు బదులిచ్చారు.

బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి వరదలకే మూడు బ్యారేజీల కింద సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్‌ దెబ్బతిన్నా నాణ్యత సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిటీ ప్రశ్నించింది. ఐఎస్‌ కోడ్‌ ప్రకారమే నిర్మాణ పనులు జరిగినట్లు గుర్తించి, సర్టిఫికెట్లు ఇచ్చామని క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు బదులిచ్చారు. కాగా, రాజేంద్రనగర్‌లోని తెలంగాణ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ లేబొరేటరీని అయ్యర్‌ కమిటీ సందర్శించి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నమూనా బ్యారేజీల పనితీరును పరిశీలించింది.  

అత్యవసర రక్షణ చర్యలు సూచించండి
వర్షాకాలం ప్రారంభానికి ముందే బ్యారేజీల రక్షణకు అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాలని అయ్యర్‌ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఈఎన్సీ (జనరల్‌) జి.అనిల్‌ కుమార్‌ కమిటీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. మంగళవారంలోగా తాము అడిగిన మొత్తం సమాచారాన్ని అందిస్తే అత్యవసర పనులను సిఫారసు చేస్తామని అయ్యర్‌ వారికి హామీ ఇచ్చారు. బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన అత్యవసర పనులను ఈఎన్సీ అనిల్‌కుమార్‌ కమిటీకి ప్రతిపాదించి అభిప్రాయాన్ని కోరగా, పరిశీలించి చెప్తామని కమిటీ బదులిచ్చింది. ఆ పనులు ఇలా ఉన్నాయి.. 

► ఒరిజినల్‌ డిజైన్లకు అనుగు ణంగా బ్యారేజీలను పున రుద్ధరించేలా.. సంబంధిత ఇండియన్‌ స్టాండర్డ్‌ (ఐఎస్‌) కోడ్స్‌ ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ పనులను నిర్మాణ సంస్థలు చేపట్టాలి. 
► బ్యారేజీల పునాదుల (ర్యాఫ్ట్‌) కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన ఖాళీలను ప్రెజర్‌ గ్రౌటింగ్‌ ద్వారా భర్తీ చేసేందుకు తగిన పద్ధతులను అవలంబించాలి. 
► బ్యారేజీలు పూర్తిగా నిండి ఉన్నప్పుడు గేట్లను తక్కువగా ఎత్తి స్వల్ప పరిమాణంలో నీళ్లను విడుదల చేసినప్పుడు తీవ్ర ఉధృతితో వరద బయటకు పొంగివస్తుంది. దీంతో బ్యారేజీల దిగువన భారీ రంధ్రాలు పడుతున్నాయి. ఇలా జరగకుండా స్వల్ప మోతాదుల్లో నీళ్లను విడుదల చేసేందుకు బ్యారేజీల్లో అనువైన చోట కొత్తగా రెగ్యులేటర్లను నిర్మించాలి. 
► 3డీ మోడల్‌ స్టడీస్‌ ఆధారంగా బ్యారేజీల ఎగువన, దిగువన ప్రవాహాలకు అడ్డంగా ఉండే రాళ్లను తొలగించాలి.
► బ్యారేజీలకి ఎగువ, దిగువ న పేరుకుపోయిన ఇసుకను నీటిపారుదల శాఖ పర్యవేక్షణ లో శాస్త్రీయంగా తొలగించాలి.
► వానాకాలంలో గేట్లన్నీ తెరిచే ఉంచాలి.
► మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లో జామ్‌ అయిన గేట్లను తొలగించాలి. ఈ బ్లాక్‌కు స్టీల్‌ షీట్‌ పైల్స్‌ను అదనంగా ఏర్పాటు చేయాలి. 

సమాచారం అందిన తర్వాతే స్పష్టత: చంద్రశేఖర్‌ అయ్యర్‌
కాళేశ్వరం బ్యారేజీలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే బ్యారేజీల వైఫల్యాల పై ఒక అంచనాకు రాగలమని చంద్రశేఖర్‌ అయ్యర్‌ స్పష్టం చేశా రు. పర్యటన ముగి సిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మరికొంత సమాచారాన్ని కోరామని, అందిన తర్వాతే స్పష్టత వస్తుందన్నారు.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers