సిద్ధమవుతున్న ‘మల్లన్నసాగర్‌ భగీరథ’

28 Jan, 2023 01:52 IST|Sakshi
మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ వద్ద నిర్మిస్తున్న నీటి శుద్ధి ట్యాంకు

మార్చి నెలాఖరులోగా ఈ పథకం పనుల పూర్తికి చర్యలు 

సిద్దిపేట, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు కొరత లేకుండా తాగునీరు

ప్రస్తుతం ఎల్లంపల్లి–హైదరాబాద్‌ పైప్‌లైన్‌ నుంచి నీటి సరఫరా

క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు నేడు స్మితా సబర్వాల్‌ రాక

గజ్వేల్‌: ‘మల్లన్నసాగర్‌ భగీరథ పథకం’సిద్ధమవుతోంది. మార్చి నెలాఖరులోగా ఈ పథకం పనులను పూర్తి చేయడానికి సంబంధిత యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. సిద్దిపేట, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు ఇక ఇక్కడి నుంచే మంచినీటి సరఫరా జరగనుంది.

ప్రస్తుతం ఈ జిల్లాలకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే పైప్‌లైన్‌ నుంచి నీటిని సరఫరా చేస్తుండగా, మార్చి తర్వాత దీనిని హైదరాబాద్‌కే పరిమితం చేసి.. ఈ పైప్‌లైన్‌కు సమాంతరంగా నిర్మిస్తున్న మల్లన్న సాగర్‌ భగీరథ కొత్త లైన్‌ ద్వారా మంచినీటి సరఫరా చేపట్టనున్నారు. ఈ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ శనివారం పర్యటించనున్నట్లు తెలుస్తోంది. 

కొరత లేకుండా మల్లన్న సాగర్‌ నుంచి నీరు..
హైదరాబాద్‌లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి సుజలస్రవంతి పథకాన్ని పదేళ్ల క్రితం రూ.3,375 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. కరీంనగర్‌ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు 186 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఈ లైన్‌ ద్వారా 735 ఎంఎల్‌డీ (మిలి యన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీటి సరఫరా జరుగుతోంది.

ఇందులో సిద్దిపేట, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు భగీరథ పథకం అవసరాల కోసం సుమారుగా 300 ఎంఎల్‌డీ నీటిని వాడుకుంటున్నారు. మిగతా నీరు హైదరాబాద్‌ అసరాలకు వెళ్తుంది. దీనివల్ల హైదరాబాద్‌కు వెళ్లే నీటిలో అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా నీరు తక్కువగా వచ్చినప్పుడు ఈ జిల్లాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది.

దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలో గజ్వేల్‌ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్‌ నీటిని మిషన్‌ భగీరథ కోసం వాడు కోవాలని నిర్ణయించారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్‌ వద్ద 540 ఎంఎల్‌డీ సామర్థ్యంతో చేపట్టిన డబ్ల్యూటీపీ పనులు పూర్తి కావొస్తున్నాయి. మార్చి నాటికి హైదరాబాద్‌ లైన్‌పై నీటిని తీసుకునే వాల్వులను మూసి వేయనున్నారు. సిద్దిపేట, జనగామ, యదాద్రి, సూర్యా పేట జిల్లాలకోసం మల్లన్నసాగర్‌ నుంచే లైన్‌లను నిర్మిస్తున్నారు. 

ఇబ్బంది లేకుండా నీటి సరఫరా..
మల్లన్నసాగర్‌ మిషన్‌ భగీరథ పథకం ద్వారా మొదటగా జనగామ జిల్లాకు నీటిని సరఫరా చేస్తారు. మల్లన్నసాగర్‌ నుంచి కొమురవెల్లి కమాన్‌ వద్ద గల ఓవర్‌హెడ్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ద్వారా జనగామ జిల్లాకు తాగునీరు వెళ్లనుంది. ఇందుకోసం మల్లన్నసాగర్‌ నుంచి కొమురవెల్లి కమాన్‌ వరకు 6.9 కిలోమీటర్ల మేర ప్రత్యేక లైన్‌ నిర్మించారు.

ప్రస్తుతం నీటిని తీసుకుంటున్న హైద రాబాద్‌ లైన్‌ వల్ల ఎప్పడైనా నీటి కొరత ఏర్పడితే తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడేవి. మార్చి తర్వాత అలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఇదే తరహాలో సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోనూ భగీరథ పథకానికి ప్రత్యేక వ్యవస్థను తీసు కురానున్నారు.  స్మితా సబర్వాల్‌ పర్యటన సందర్భంగా మార్చి ఆఖరులోగా పనులు పూర్తి చేయడానికి దిశానిర్దేశం చేయనున్నారు.

మార్చి నెలాఖరులో పనులు పూర్తిచేయడమే లక్ష్యం 
నాలుగు జిల్లాల తాగునీటి సరఫరాకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే ‘మల్లన్నసాగర్‌ భగీరథ పథకం’ఉద్దేశం. దీనికి సంబంధించి పనులు సాగుతున్నాయి. మార్చి నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తాం. 
– రాజయ్య, మిషన్‌ భగీరథ ఈఈ, గజ్వేల్‌ 

మరిన్ని వార్తలు