భారీగా ‘బ్యాక్‌లాగ్‌’! ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిపోతున్న పోస్టులు

29 Mar, 2024 01:35 IST|Sakshi

ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిపోతున్న పోస్టులు

ఒకే అర్హతలున్న కొలువులన్నింటికీ దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు 

రెండు, అంతకంటే ఎక్కువ జాబ్‌లకు ఎంపికవుతున్న కొందరు.. అందులో పైస్థాయి కొలువుల ఎంపికతో మిగతావి ఖాళీ 

ఇలా ప్రతి కేటగిరీలోనూ సగటున 10% దాకా మిగులు 

ఒక్క గురుకుల పోస్టులకు సంబంధించే 1,810 ఖాళీలు 

కానిస్టేబుల్‌ కేటగిరీలో మరో 2 వేల పోస్టులు మిగులు 

వైద్యారోగ్య శాఖలోనూ దాదాపు 780 పోస్టులు ఖాళీ 

వీటి భర్తీకి కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సిన పరిస్థితి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నియామక సంస్థలకు బ్యాక్‌లాగ్‌ తిప్పలు పట్టుకున్నాయి. ఒకే సమయంలో భారీగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియలు చేపడుతుండటంతో.. గణనీయ సంఖ్యలో ఉద్యోగా­లు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. పోటీ పరీక్షల కోసం పకడ్బందీగా సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు.. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. వాటిలో ఒకదానిని ఎంచుకోవడంతో మిగతా ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతున్నాయి.

ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కౌన్సెలింగ్‌ను ఒకే సమయంలో నిర్వహించడం వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఉద్యోగాలకు ఎంపికైనవారు వాటిని వదులుకుంటే.. తర్వాతి మెరిట్‌ అభ్యర్థులకు కేటాయించే పరిస్థితి (రిలిక్విష్ మెంట్‌) లేకపోవడం కూడా సమస్యకు దారితీస్తోంది. ఇలా మిగిలిపోయిన ఉద్యోగాలకు మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేసి, భర్తీ ప్రక్రియ చేపట్టాల్సి వస్తోంది. ఇటీవల భర్తీ చేసిన గురుకుల కొలువులు, పోలీస్‌ కానిస్టేబుల్, స్టాఫ్‌ నర్స్, మెడికల్‌ ఆఫీసర్‌ తదితర కేటగిరీ ఉద్యోగాల్లో సుమారు 10శాతానికిపైగా ఇలా మిగిలిపోవడం గమనార్హం. 

33వేల కొలువుల్లో.. 4,590 ఉద్యోగాలు ఖాళీ.. 
రాష్ట్రంలో గత మూడు నెలల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 33 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. ఇందులో 4,590 ఉద్యోగాలు మిగిలిపోయినట్టు నియామక సంస్థల ప్రాథమిక గణాంకాలు చెప్తున్నాయి. ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో విధుల్లో చేరితే ఇందుకు సంబంధించి మరింత స్పష్టత రానుంది. గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పరిధిలో ఇప్పటివరకు 8.820 ఉద్యోగాల భర్తీ చేపట్టగా.. ఏకంగా 1,810 ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలినట్టు సమాచారం.

పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా ఇటీవల చేపట్టిన 15,644 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో దాదాపు 2వేల ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఇక మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 7 వేల స్టాఫ్‌ నర్సు, 1,150 మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలను భర్తీ చేయగా.. వీటిలోనూ 780 ఉద్యోగాలు మిగిలిపోయాయి. 

రిలిక్విష్మెంట్‌ లేకపోవడంతో.. 
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీలో రిలిక్విష్మెంట్‌ విధానాన్ని అనుసరించారు. అంటే ఏదైనా నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రకటించిన ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ కాకుంటే.. అందులోని తర్వాతి మెరిట్‌ అభ్యర్థులతో భర్తీచేసేందుకు వీలు ఉండేది. 2018 వరకు ఈ విధానాన్ని అనుసరించారు. కానీ ఈ విధానంలో పారదర్శకత లోపించిందంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, దానికితోడు ఇతర కారణాలతో రిలిక్విష్మెంట్‌ విధానాన్ని పక్కనబెట్టారు.

రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి వచ్చాక జారీ అయిన నోటిఫికేషన్లలో రిలిక్విష్మెంట్‌ అంశాన్ని జతచేయలేదు. అంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎన్ని పోస్టులు మిగిలినా అదే నోటిఫికేషన్‌ కింద భర్తీ చేసే అవకాశం లేదు. ఇటీవల రిలిక్విష్మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, నిబంధనలపై చర్చించినా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఫలితంగా భర్తీ ప్రక్రియలో బ్యాక్‌లాగ్‌ ఖాళీలు మిగిలిపోతున్నాయి. వాటిని భర్తీ చేయాలంటే మళ్లీ కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సిందేనని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నియామకాల ప్రక్రియలు ఇంకా కొనసాగుతుండటంతో.. నోటిఫికేషన్ల వారీగా ఏర్పడే ఖాళీలపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు.   

Election 2024

మరిన్ని వార్తలు