Telangana Election Results 2023: బాల్క సుమన్‌ను అదే ముంచేసిందా?

3 Dec, 2023 15:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే నన్ను మరోసారి అందలమెక్కిస్తాయి. నా విజయానికి తిరుగులేదు. నా గెలుపును ఎవరు కూడా ఆపలేరు. అంగ బలం,అర్థ బలం అన్ని ఉన్న నేను అవలీలగా గెలువబోతున్న అంటూ మితిమీరిన విశ్వాసమే చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ను నిండా ముంచింది అనే అభిప్రాయాలు నియోజకవర్గంలో వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ, సింగరేణి అధికారులను నిర్లక్ష్యంగా చూడటం. వ్యక్తిగత సహాయకులు నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడటం. సీనియర్ నాయకులతో నాకు పనిలేదు. నేను ఎవరితో పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ పార్టీ సీనియర్ నాయకులను పక్కకు పెట్టడం.

బాల్క సుమన్ పేరు చెప్పుకొని పలువురు నాయకులు,కార్యకర్తలు సింగరేణి,ప్రభుత్వ అధికారులపై పెత్తనం చెలాయించడం.తప్పుడు సమాచారం సుమన్ కు చేరవేయడం. అసలయిన విషయాన్నీ చెప్పకుండా దాచిపెట్టడం. నచ్చని నాయకులపై సుమన్ కు చాడీలు చెప్పడం. మందమర్రి,రామకృష్ణపూర్లో సింగరేణి క్వార్టర్ ల విషయంలో సుమన్‌ను నమ్ముకున్న వారికీ కాకుండ, పార్టీ క్యాడర్ లో కొందరు అక్రమంగా కబ్జాకు పాల్పడి వారి బందువులకు క్వార్టర్లను ఇప్పించడం. 

మందమర్రిలో గిరిజనుల భూములను కబ్జా చేయడం వంటి చర్యలు సుమన్ రెండో విజయానికి అడ్డుగోడల నిలిచాయని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కోటపల్లి మండలంలో రైతులను కాళేశ్వరం బ్యాక్ వాటర్ నష్టపరిచినా స్పందించకపోవడంతో ఆ మండల వాసులు సుమన్‌ను వ్యతిరేకించారు. స్థానికంగా ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా, హైదరాబాద్ కె ఎక్కువ సమయం ఇవ్వడం కూడా సుమన్‌ను నష్టపరిచిందనే ఆరోపణ కూడా ఉంది. 

ఎమ్మెల్యేగా,ప్రభుత్వ విప్ గా ,పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికినీ నియోజక వర్గం ప్రజలు ఆశించిన మేరకు అభివృద్ధికి నోచుకోలేదనే అభిప్రాయాలూ సైతం ఉన్నాయి. గెలిచిన వెంటనే మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు జరిపిస్తా అని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన సుమన్ ఆ హామీని నెరవేర్చకపోవడం కూడా అయన ఓటమికి మరొక కారణమయినదని చెప్పవచ్చు.
 

మరిన్ని వార్తలు