నా బలం, బలగం ‘సాగర్‌’ ప్రజలే.. అవే నన్ను గెలిపిస్తాయి: ఎమ్మెల్యే భగత్‌

29 Nov, 2023 09:42 IST|Sakshi

‘సాగర్‌ నియోజకవర్గ ప్రజలే నా బలం.. బలగం. నేను ప్రచారానికి వెళ్తే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. గతంతో పోల్చితే నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. బీఆర్‌ఎస్‌ పథకాలు, నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తాయి’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్‌  బీఆర్‌ఎస్‌  అభ్యర్థి నోముల భగత్‌ సాక్షితో మాట్లాడారు.          

నల్గొండ: సాగర్‌ ఉప ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు నన్ను గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యం వారికి అందుబాటులో ఉంటున్నా. ఇక్కడే స్థిరనివాసం ఏర్పచుకుని నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నా. సాగర్‌లో ఏడు సార్లు పాలించినవారు చేయని అభివృద్ధిని కేవలం రెండున్నరేళ్లల్లోనే నేను చేసి చూపెట్టా. బలహీనవర్గాల బిడ్డగా ప్రజలు మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తా.

రూ.200 కోట్లతో అభివృద్ధి చేశా..
2018లో తొలిసారిగా మా నాన్న నోముల నర్సింహయ్య ఎమ్మెల్యేగా గెలిచాక హాలియా, నందికొండను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలో 40 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాం. నేను గెలిచాక రూ.60 కోట్లతో హాలియా, నందికొండ పట్టణాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. వరద కాల్వ పనులను పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. నియోజకవర్గంలో 10 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు నిర్మించాం. నందికొండలో క్వాటర్స్‌లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చాం. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశాం. సాగర్‌లో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. నియోజకవర్గంలోని మూడు పీహెచ్‌సీలకు రూ.25 లక్షల చొప్పున కేటాయించి అభివృద్ధి చేశాం. కంపాసాగర్‌లో ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలను బీఎస్సీ అగ్రికల్చర్‌ కళాశాలగా ఏర్పాటు చేయడమే నాముందు ఉన్న ఏకైక లక్ష్యం.
 
నెల్లికల్లు పనులు శరవేగంగా సాగుతున్నాయి..
రూ.664 కోట్లతో నెల్లికల్లు లిఫ్ట్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్దవూర మండలంలో సుమారు రూ.2.5 కోట్లతో డీ8, డీ9 లిఫ్ట్‌ పనులు పూర్తి చేశాం. దీని ద్వారా 7300 ఎకరాలకు సాగునీరు అందనుంది. రూ.33.81 కోట్లతో చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టాం. ఇంకా త్రిపురారం, గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లో లిఫ్ట్‌లు, చెక్‌డ్యాంల ఏర్పాటు చేయాల్సి ఉంది.

మరిన్ని వార్తలు