కరోనాతో కుటుంబ పెద్ద మరణిస్తే.. రూ. 5 లక్షలతో స్వయం ఉపాధి

25 Jun, 2021 07:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరోనాతో కుటుంబ పెద్ద మరణిస్తే స్మైల్‌ పథకం కింద జాతీయ బీసీ ఆర్థికాభివృద్ధి సంస్థ తోడ్పాటు 

జిల్లాస్థాయిలో ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం 

రూ.3 లక్షల వార్షికాదాయం ఉన్న కుటుంబానికే అర్హత 

సాక్షి, హైదరాబాద్‌: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి కరోనా కాటుకు బలి అయితే, ఆ కుటుంబ సభ్యులు వీధిన పడకుండా చేయూత ఇచ్చేందుకు జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ) ‘స్మైల్‌’కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ, ఆ కుటుంబానికి ఆర్థికపరమైన అంశాల్లో ఆసరా ఇచ్చే లక్ష్యంతో స్మైల్‌ను ముందుకు తీసుకొచ్చింది. ఏడాదిన్నరగా కొనసాగుతున్న కోవిడ్‌–19 వ్యాప్తితో చాలా కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. పలు రంగాల్లో ఉద్యోగాల కోత విధించడంతో ఉపాధి కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది.

కోవిడ్‌–19తో కుటుంబ పెద్ద మరణిస్తే... ఆ కుటుంబానికి స్వయం ఉపాధి యూనిట్‌ ఏర్పాటుకు ఎన్‌బీసీఎఫ్‌డీసీ ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ స్వయం ఉపాధి యూనిట్‌పై గరిష్టంగా రూ.5 లక్షలు సమకూరిస్తే.. అందులో రూ.4 లక్షలు రాయితీ కింద ఎన్‌బీసీఎఫ్‌డీసీ లబ్ధిదారుకు అందిస్తుంది. మిగతా రూ.లక్షను బ్యాంకు నుంచి రుణం రూపంలో మంజూరు చేస్తుంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఈ ప్రతిపాదనలను ఈనెల 26లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. 

దరఖాస్తుకు అర్హతలివీ...
కరోనా వైరస్‌ సోకి మరణించిన కుటుంబ పెద్ద వయసు 60 సంవత్సరాలలోపు ఉండాలని ఎన్‌బీసీఎఫ్‌డీసీ స్పష్టం చేసింది. కుటుంబ సభ్యుడి మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు తహసీల్దారు నుంచి పొందిన కుల ధ్రువీకరణ పత్రం, కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలలోపు ఉన్నట్లు నిర్ధారణ పత్రం దరఖాస్తుతో జతచేయాలి. వీటిని నేరుగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాల్లో సమర్పించవచ్చు. దరఖాస్తులో మరణించిన కుటుంబ సభ్యుడి పేరు, మరణించిన రోజుకు వయసు, ఆధార్‌ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్‌ నంబర్లు, కులం తదితర వివరాలను భర్తీ చేయాలి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా సంక్షేమాధికారులు ఈనెల 26లోగా రాష్ట్ర కార్యాలయానికి పంపితే... రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఎన్‌బీసీఎఫ్‌డీసీ కార్యాలయానికి పంపుతుంది. బీసీ కుటుంబాలకు ప్రయోజనకరమైన ఈ పథకంపై పెద్దగా ప్రచారం లేకపోవడం... రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఈ నెల 23న సూచనలు జారీ చేసి కేవలం మూడు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించడం క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఇబ్బంది కలిగించే అంశమే.
 

>
మరిన్ని వార్తలు