Omicron Variant: కెన్యా నుంచి సిటీకి.. ఒమిక్రాన్‌ రోగి కోసం ఉరుకులు పరుగులు

18 Dec, 2021 13:32 IST|Sakshi

గుర్తించి ఆస్పత్రికి తరలించిన పోలీసులు  

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): కెన్యా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒమిక్రాన్‌ బాధితుడు కనిపించడం లేదంటూ వైద్య శాఖాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. కెన్యాకు చెందిన అబ్దుల్లాహి యారో ఇబ్రహీం(44) ఈ నెల 14న నగరానికి వచ్చాడు. విమానాశ్రయంలో అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఈ నెల 16న అతడికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ అని తేలింది. టోలిచౌకి సమీపంలోని పారామౌంట్‌ కాలనీలో ఇబ్రహీం నివాసం ఉంటున్నట్లు తెలుసుకొని అధికారులు అక్కడికి వెళ్లగా ఆచూకీ తెలియలేదు.

దీంతో వైద్య శాఖాధికారులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పారామాంట్‌ కాలనీలో సోదాలు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతోపాటు గెస్ట్‌హౌజ్‌లు, హోటళ్లలో తనిఖీలు చేశారు. ఇబ్రహీం రాత్రి 8 గంటల ప్రాంతంలో అపోలో ఆస్పత్రి సమీపంలోని ఓ గెస్ట్‌హౌజ్‌లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. వైద్యశాఖ సిబ్బంది సాయంతో టిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అతడితోపాటు గదిలో ఉన్న నూర్‌ అనే వ్యక్తికి కూడా ఒమిక్రాన్‌ సోకి ఉండొచ్చనే అనుమానంతో అతడిని కూడా టిమ్స్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు