పదహారు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి

28 May, 2021 02:43 IST|Sakshi

పదహారు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి

మేడారం సమ్మక్క ప్రధాన పూజారి ఇంట్లో విషాదం

పిల్లల బాధ్యత తీసుకుంటామని వెల్లడించిన మంత్రులు 

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: వారు అభం, శుభం తెలియని చిన్నారులు.. ఒకరి వయసు ఐదేళ్లు, మరొకరికి మూడేళ్లు. పదహారు రోజుల వ్యవధిలోనే వారి తల్లి, తండ్రి ఇద్దరినీ కరోనా బలితీసుకుంది. ఈ విషయం చిన్నారులకు ఎలా చెప్పాలో తెలియక, వారి ఆలనా పాలనా ఏమిటని ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన మునీందర్‌ ఇంట్లో జరిగిన విషాదం ఇది.

ఒకరి వెంట ఒకరు..
మేడారం సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన మునీందర్‌ పెద్ద కుమారుడు సమ్మారావు (28). ఆయన కూడా జాతరలో  సమ్మక్క తల్లిని తీసుకొచ్చే క్రతువులో పాల్గొంటారు. సమ్మారావుకు భార్య సృజన (25), ఐదేళ్ల కుమారుడు జ్ఞానేశ్వర్, మూడేళ్ల కుమార్తె తేజస్విని ఉన్నారు. గత నెల 30న సమ్మారావు, సృజన ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం పాటు ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ సమయంలో చిన్నారులిద్దరిని తాత మునీందర్, ఇతర బంధువులు చూసుకున్నారు. వారం తర్వాత తల్లిదండ్రులు ఇంటికి రావడంతో పిల్లల ముఖాల్లో వెలుగు వచ్చింది. అంతా బాగుందని అనుకునేలోపే మరో ఘోరం జరిగింది. ఇంటికొచ్చిన నాలుగైదు రోజులకే సృజనకు శ్వాస సమస్యలు తలెత్తాయి. ఆక్సిజన్‌ శాతం పడిపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

అక్కడే చికిత్స పొందుతూ ఈ నెల 11న కన్నుమూసింది. మృతదేహాన్ని మేడారం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అమ్మ ఏదని పిల్లలు అడుగుతుంటే.. రేపు, ఎల్లుండి వస్తుందని చెబుతూ సమ్మారావు బాధను దిగమింగుకుంటూ వచ్చాడు. భార్య చనిపోయిన బాధలో ఉన్న సమ్మారావుకు కూడా మళ్లీ ఆరోగ్యం దెబ్బతిన్నది. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి గురువారం కన్నుమూశాడు.

నాన్న నిద్రపోతున్నాడు.. అమ్మ ఏది?
సృజన చనిపోయి అంత్యక్రియలు చేసిన విషయం, సమ్మారావు చనిపోయిన విషయం వారి ఇద్దరు చిన్నారులకు తెలియదు. గురువారం సమ్మారావు మృతదేహాన్ని మేడారం తీసుకొచ్చి భార్య సమాధి పక్కనే ఖననం చేశారు. ఈ క్రమంలో తండ్రి మృతదేహాన్ని దూరం నుంచే పిల్లలకు చూపించగా.. ఆయన నిద్రపోతున్నాడని అనుకున్నారు. ‘‘నాన్న ఇంటికి వచ్చాడు.. మరి అమ్మ ఎప్పుడు వస్తుంది’’ అని వచ్చీరాని మాటలతో చుట్టూ ఉన్న పెద్దలను అడిగారు. ఇది చూసి అంతా కన్నీరు మున్నీరయ్యారు.

తల్లిదండ్రులు ఇద్దరూ లేరని పిల్లలకు ఎలా చెప్పాలంటూ బంధువులు గుండెలు బాదుకున్నారు. కాగా.. సమ్మారావు మృతిపై మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం తెలిపారు. రోజుల వ్యవధిలోనే భార్యాభర్త మృతి చెందడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. పిల్లల బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించి ఆ కుటుంబానికి నిలుస్తుందని తెలిపారు.
 

మరిన్ని వార్తలు