Telangana Assembly Elections: కోడ్‌ పేరుతో సామాన్యుల నడ్డి విరుస్తున్న పోలీసులు 

26 Oct, 2023 10:51 IST|Sakshi

హైదరాబాద్: మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ పేరు చెప్పి పోలీసులు సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీల పేరుతో దొరికిన నగదు దొరికినట్లు సీజ్‌ చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో ఖర్చులకు ఉద్దేశించిందే అన్నట్లు హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు కనిపిస్తోంది. బుధవారం రామాయంపేట చెక్‌పోస్టు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల సంఘానికి లెక్కలు చూపించడం కోసమే అన్నట్లు ఈ పోలీసులు విచక్షణ మరచి వ్యవహరించారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు కామారెడ్డిలో లాజిస్టిక్స్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. తమ వ్యాపార కార్యకలాపాల కోసం వెళ్లిన వీళ్లు బుధవారం కారులో తిరిగి వస్తున్నారు. అందులో ఉన్న బ్యాగులో రూ.50 వేలు (రూ.500 నోట్ల కట్ట) ఉంది.

రామాయంపేట వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసిన పోలీసులు ఈ కారు ఆపారు. బ్యాగ్‌ తనిఖీ చేసిన ఎస్‌ఐ నేతృత్వంలోని పోలీసులు అందులో రూ.50 వేలు ఉండటం గమనించారు. నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి రూ.50 వేల వరకు నగదు ఎలాంటి రసీదులు లేకుండా తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయినప్పటికీ చెక్‌పోస్టులోని పోలీసులు యువకులను ఆ నగదుకు లెక్కలు చెప్పమని గద్దించారు. అవి తమ వ్యాపారానికి సంబంధించినవి అని చెప్తున్నా వినిపించుకోలేదు. రూ.50 వేలు సీజ్‌ చేసే అవకాశం లేకపోవడంతో ఆ పోలీసులు ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేచారు. ఆ యువకుల జేబుల్లో, పర్సులు తనిఖీ చేశారు. ఒకరి పర్సులో రూ.200 ఉండటంతో ఆ మొత్తంతో కలిపి తాము రూ.50,200 సీజ్‌ చేసినట్లు, అవి ఒకరి వద్దే లభించినట్లు పంచనామా సిద్ధం చేశారు.

ఇందులో ఇద్దరి పేర్లు ప్రస్తావించకుండా ఒకరి పేరు రాసి ఆ మొత్తం స్వాదీనం చేసుకున్నారు. రూ.50 వేలకు మించిన నగదు ఒకరి వద్ద ఉంటే సీజ్‌ చేస్తారా? లేక ఒక వాహనంలో ఉంటే సీజ్‌ చేస్తారా? దానికి సంబంధించి ఈసీ ఆదేశాలు చూపాలంటూ యువకులు కోరినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ ఉత్తర్వులు చూపాలంటే ముందు పేరు చెప్పాలంటూ తెలుసుకుని పంచనామాపై రాశారు. రామాయంపేట పోలీసుల తీరుపై యువకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తమ లెక్కల కోసం ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు న్యాయమనిప్రశ్నిస్తున్నారు.

గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రం మొత్తం ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. కోడ్‌ పేరుతో పోలీసుల చూపిస్తున్న అత్యుత్సాహం సామాన్యులకు ఇబ్బందులు తెచి్చపెడుతోంది. కోడ్‌ అమలులోకి వచి్చన నాటి నుంచి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా నగదు సీజ్‌ చేశారు. హైదరాబాద్‌లోనే ఈ మొత్తం రూ.15 కోట్ల వరకు ఉంది. బోయిన్‌పల్లి పోలీసులు ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్న రూ.55,900 నగదుతో మాత్రమే ఎన్నికల లింకులు ప్రాథమికంగా బయటపడ్డాయి. ఈ నగదు తరలిస్తున్న న్యూ బోయిన్‌పల్లి వాసి ఎం.భాస్కర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త కావడంతో ఆ కోణంలో ‘ఎలక్షన్‌ డబ్బు’గా అనుమానిస్తూ స్వాదీనం చేసుకున్నారు. ఇది మినహా మరే ఇతర ఉదంతంలోనూ నగదు స్వాధీనంలో రాజకీయ కోణం బయటపడకపోవడం గమనార్హం. 
 

మరిన్ని వార్తలు