దారుణం: డబ్బు ఇస్తేనే మృతదేహం 

13 May, 2021 04:05 IST|Sakshi
సాంబయ్య (ఫైల్‌)

ఓ ప్రైవేటు ఆస్పత్రి కర్కశత్వం

మాజీ వీసీ భౌతిక కాయం ఇచ్చేందుకు నిరాకరించిన వైనం

ఆయన శిష్యుడి హామీ పత్రంతో అప్పగించిన ఆస్పత్రి

కేయూ క్యాంపస్‌ (వరంగల్‌): నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ మాజీ ఉప కులపతి, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్‌ ఆచార్యులు, వరంగల్‌కు చెందిన పసుల సాంబయ్య(67) కరోనాతో కన్నుమూశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన ఆయన హన్మకొండలోని ప్రశాంత్‌నగర్‌లో నివాసముంటున్నారు. గత నెలలో మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న సాంబయ్య ఇటీవల కరోనా సోకగా హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ 15రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కరోనాతో పోరాడే క్రమంలో చివరికి నెగెటివ్‌ వచ్చినా గుండెపోటుతో రావడంతో ఆయన మృతి చెందారని వైద్యులు తెలిపారు.  

బిల్లు చెల్లిస్తేనే మృతదేహం 
సాంబయ్య కరోనా చికిత్స పొందుతున్న విషయాన్ని పలువురు జిల్లా నాయకులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఆస్పత్రి బిల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇంతలోనే ఆయన మృతి చెందారు. మొత్తం రూ.10.50లక్షల బిల్లులో ఇప్పటి వరకు రూ.4 లక్షలు చెల్లించారు. మిగతాది చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టంచేయగా.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి బిల్లు వస్తుందని ఓ ప్రజాప్రతినిధి, వైద్య ఆరోగ్యశాఖలోని ఉన్నతాధికారి సైతం యాజమాన్యానికి ఫోన్‌లో చెప్పినా ఒప్పుకోలేదు. సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి చెక్కు రాకపోతే మిగతా రూ.6.50లక్షలు చెల్లిస్తానని సాంబయ్య శిష్యుడు డాక్టర్‌ బండి శ్రీను ఇచ్చిన హామీ పత్రంతో మృతదేహాన్ని సాయంత్రం అప్పగించారు. అనంతరం సాంబయ్య మృతదేహాన్నిస్వగ్రామమైన నాగారానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.

మరిన్ని వార్తలు