ఏం వైద్యం చేశారు.. మందులేం వాడారు?

27 May, 2021 18:05 IST|Sakshi

ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి శవాన్ని అప్పగిస్తారా? 

హైదరాబాద్‌ విరించి ఆస్పత్రి సిబ్బందిపై కరోనా మృతుడి కుటుంబ సభ్యుల ఆగ్రహం

ఆస్పత్రి అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం  

హైదరాబాద్‌: ‘మా పేషెంట్‌కు ఏం వైద్యం చేశారు.. మందులేం వాడారు? మొన్నటి వరకు ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పి.. శవాన్ని అప్పగిస్తారా’అంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. ఆస్పత్రి అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. గురువారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.  


నల్లగొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ (40)కు కరోనా సోకి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 9న విరించి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సల నిమిత్తం రూ.11 లక్షలు చెల్లించారు. మొదట్లో ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు భరోసా ఇచ్చారు. అయితే.. 22న వంశీకృష్ణ మృతి చెందాడని, మిగిలిన డబ్బులు కట్టకున్నా పర్వాలేదు మృతదేహాన్ని తీసుకెళ్లండని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు వంశీకృష్ణ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.


అయితే, ఆస్పత్రి సిబ్బంది తీరుపై అనుమానం రావడంతో గురువారం మృతుడి బంధువులు ఆస్పత్రి వద్దకు వచ్చి తమ పేషెంట్‌కు ఏం మందులు వాడారు.. ఏం చికిత్స చేశారో చెప్పాలని అడిగారు. ఆ వివరాలిస్తే తమ కుటుంబంలో ఉన్న వైద్యులకు చూపించుకుంటామని పేర్కొన్నారు. అయితే, సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు. హైడోస్‌ మందులు వాడటం వల్లే వంశీకృష్ణ మృతి చెందాడని, అతని మృతికి ఆస్పత్రి వర్గాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంప్యూటర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి వారిని సముదాయించడానికి ప్రయత్నించినా.. ఫలితం కనిపించలేదు. దీంతో 16 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

(చదవండి: జూనియర్‌ డాక్టర్ల చర్చలు సఫలం..స్టైఫండ్‌ పెంపు)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు