మాజీ డీఎస్పీ నళినికి అదే ఉద్యోగం ఎందుకు ఇవ్వొద్దు?: సీఎం రేవంత్ రెడ్డి

16 Dec, 2023 12:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్‌ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అడిగారు. నళినికి ఉద్యొగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీ.ఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా ఉంటే  అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.

సచివాలయంలో శుక్రవారం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్‌ శాఖలో నియామకాలమీద సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలా మంది తిరిగి ఉద్యొగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో అభ్యంతరాలు ఎందుకు ఉండాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని సీఎం అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో మార్మోగిన పేరు డీఎస్పీ నళిని. తెలంగాణ కోసం ఉద్యమించే నా అన్నాచెల్లెళ్లపై లాఠీ ఝుళిపించలేనంటూ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారామే. అక్కడితో ఆగకుండా తన డీఎస్పీ ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. 2012లో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది.

అనంతరం ఉద్యమంలో భాగంగా ఆమె ఢిల్లీలో రెండు సార్లు దీక్షకు సైతం కూర్చున్నారు. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఆమె ప్రస్తావన పుష్కరకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇక నళినికి రాష్ట్రం ఏర్పడిని అనంతరం.. గత ప్రభుత్వంలో గానీ ఎలాంటి గుర్తింపు దక్కలేదు. అయితే ప్రభుత్వం మారగా ఇప్పుడైనా ఆమెకు సరైన గుర్తింపు దక్కాలని, చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.

నళిని ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నారని, ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమెను డిసెంబర్ 4, 2011న సస్పెండ్ చేయడంతో మీడియాలో సంచలనంగా మారారు. ఆమెను దేశ ద్రోహంకు పాల్పడినట్లు నిందించడంపై అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారని ఆమె గుర్తు చేసుకొంటున్నారు.

ఇక ఆమె డిఎస్పీ ఉద్యోగంపై రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. ఢిల్లీలో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉప ఎన్నికలో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం వంటివి అన్ని ఉద్యమంలో భాగంగానే చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె ఎవరినీ కలవలేదు.

>
మరిన్ని వార్తలు