లాక్‌డౌన్‌ కోసం లాఠీ పట్టారు

23 May, 2021 02:22 IST|Sakshi

సీఎం ఆదేశాలతో కట్టుదిట్టంగా అమలు 

జిల్లాల్లో లాక్‌డౌన్‌ను పర్యవేక్షించిన సీపీలు, ఎస్పీలు 

 రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, పల్లెల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌ మూసివేత 

పలుచోట్ల విద్యుత్‌ ఉద్యోగులు, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌పై లాఠీచార్జి 

సాక్షి, హైదరాబాద్‌/ నెట్‌వర్క్‌: శనివారం ఉదయం 10.30 గంటలు.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, పల్లెల్లోకి వచ్చీపోయే దారులన్నీ మూతపడ్డాయి.. ప్రధాన రహదారులన్నిటా చెక్‌పోస్టులు కట్టుదిట్టం అయ్యాయి.. రోడ్లపైకి వచ్చినవారిని వచ్చినట్టు పోలీసులు ఆపేశారు. అనవసరంగా వచ్చినట్టు కనిపించినవారిపై లాఠీలు ఝళిపించారు. ఎక్కడివారిని అక్కడ్నుంచే వెనక్కి పంపేశారు.. రాష్ట్రంలో పలుచోట్ల లాక్‌డౌన్‌ సరిగా అమలు కావడం లేదని, కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో.. పోలీసులు పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలుపై దృష్టిపెట్టారు.

హైదరాబాద్‌లో డీజీపీ, జిల్లాల్లో ఎస్పీలు, కమిషనర్లు నేరుగా రంగంలోకి దిగి పర్యవేక్షించారు. అవసరం లేకున్నా రోడ్డు మీదికి వచ్చిన వాహనాలను సీజ్‌ చేసి, కేసులు పెట్టారు. పలుచోట్ల పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇన్నిరోజులు సరిగా పట్టించుకోకుండా.. ఇప్పుడు అవసరంపై బయటికొచ్చిన వారిపైనా ప్రతాపం చూపడం ఏమిటన్న ఆగ్రహం వ్యక్తమైంది. 

సీఎం కేసీఆర్‌ ఆగ్రహంతో.. 
శుక్రవారం వరంగల్‌ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌.. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ పరిస్థితులపై అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌ సరిగా అమలుకావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. శనివారం 10 గంటల తర్వాత రోడ్డుపై కనిపించిన వారిపై పోలీసులు విరుచుకుపడ్డారు. అకారణంగా బయటికి వచ్చిన వారిపై లాఠీచార్జి చేసి, వేలాది వాహనాలు సీజ్‌ చేశారు. నల్లగొండ, వరంగల్, మరికొన్ని జిల్లాల్లో డ్రోన్‌ కెమెరాలతో లాక్‌డౌన్‌ పరిస్థితిని సమీక్షించారు. మంచిర్యాల జిల్లాలో రామగుండం పోలీసు కమిషనర్‌ వి.సత్యనారాయణ స్వయంగా లాఠీ పట్టి రోడ్డుపైకి వచ్చిన వారిని కట్టడి చేశారు. హైదరాబాద్‌ నగర శివార్లలో, ప్రధాన రహదారులపై మూడు రకాల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. 

ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌పై ప్రతాపం! 
హైదరాబాద్‌లో వందల మంది ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ను అడ్డుకుని, లాఠీచార్జి చేయడం, వాహనాలు సీజ్‌ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఫుడ్‌ డెలివరీకి మినహాయింపు ఉందని.. ఆస్పత్రుల్లో, ఇళ్లలో ఉన్న వేల మంది కరోనా రోగులకు ఆహారం సరఫరా చేస్తున్నామని.. తమను అడ్డుకోవడం ఏమిటని వారు నిలదీశారు. ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌పై లాఠీచార్జిని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, పలువురు రాజకీయ నాయకులు తప్పుబట్టారు.

అయితే తాము ఫుడ్‌ తీసుకెళ్తున్న వారిని ఏమీ అనలేదని, గుర్తింపు కార్డులు లేకుండా.. కేవలం స్విగ్గీ, జొమాటో టీషర్టులు వేసుకుని తిరుగుతున్నవారి వాహనాలనే సీజ్‌ చేశామని పోలీసులు అన్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో.. స్విగ్గీ, జొమాటో సంస్థలు శనివారం తమ ఫుడ్‌ డెలివరీ సర్వీసులను నిలిపివేశాయి. డెలివరీ బాయ్స్‌పై పోలీసుల లాఠీచార్జిని తప్పుపడుతూ.. న్యాయవాది కారం కొమిరెడ్డి మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జీవో నం 102 ప్రకారం.. ప్రభుత్వమే ఫుడ్‌ డెలివరీ సర్వీసులను అనుమతించినపుడు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. 

అత్యవసరమైన వారినీ అడ్డుకోవడంపై.. 
పలుచోట్ల తలసేమియా రోగులు, వారికి రక్తదానం చేయడానికి వెళ్తున్న దాతలను సైతం పోలీసులు అడ్డుకోవడం కనిపించింది. దీనిపై తలసేమియా రోగుల తల్లిదండ్రులు డీజీపీకి మొరపెట్టుకున్నారు. తమను అనుమతించాలని, ప్రాణాలు ఆపదలో పడతాయని ప్రాధేయపడ్డారు. నల్లగొండలో విద్యుత్‌ సిబ్బంది, మీడియా, ఇతర శాఖల ఉద్యోగులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

6 నుంచి 10 మధ్య గందరగోళం! 
లాక్‌ డౌన్‌ సమయంలో పోలీసుల హడావుడి ఇకవైపు అయితే.. అంతకుముందు మినహాయింపు సమయం 6 నుంచి 10 గంటల మధ్య పరిస్థితి గందరగోళంగా మారింది. ఎక్కడ చూసినా జనం గుంపులు, గుంపులుగా బయటికివచ్చారు. వ్యాపార సంస్థలు, దుకాణాల వద్ద భౌతిక దూరం అనేది ఎక్కడా పాటించలేదు. ఈ నాలుగు గంటల్లో ఎక్కడా పోలీసులు కనిపించలేదు. కోవిడ్‌ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకునే లేకుండా పోయారు. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు