రేషన్‌కార్డే ప్రామాణికం! లేకపోతే నో

6 Feb, 2024 01:28 IST|Sakshi

200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ అమలుపై సర్కార్‌ కసరత్తు

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే రెండు గ్యారంటీల అమలు ప్రక్రియ షురూ

ఇప్పటికే సంబంధిత సన్నాహాలు మొదలెట్టిన విద్యుత్, పౌరసరఫరాల శాఖలు

నేటి నుంచే వినియోగదారుల నుంచి అర్హత వివరాల సేకరణ.. రేషన్‌కార్డు లేకపోతే నో

సాక్షి, హైదరాబాద్‌: ఆరు గ్యారంటీలలో భాగంగా ఈ నెలలోనే అమలు చేయాలని భావిస్తున్న మరో రెండు గ్యారంటీలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాల్లోనే రూ.500కు గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ (గృహజ్యోతి) హామీల అమలు ప్రక్రియ ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు హామీలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికకు రేషన్‌కార్డు (ఆహార భద్రతా కార్డు)నే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.

ఇందుకోసం సంబంధిత అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు కూడా ప్రారంభించింది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి విద్యుత్‌ శాఖ, రూ 500కు గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ చేసే ప్రక్రియపై పౌరసరఫరాల శాఖ విధి విధానాలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు అందినప్పటికీ, నేరుగా వినియోగదారుల నుంచి అర్హతకు సంబంధించిన పత్రాలు తీసుకోవాలని ఆయా శాఖలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియను మంగళవారం నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. 

కోత తప్పదా?
రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్‌ (గృహ వినియోగ) గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, 1.23 కోట్ల గృహావసర విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రస్తుతం రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద జారీ అయిన ఆహార భద్రతా కార్డులు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రతా కార్డులు కలిపి 90,14,263 రేషన్‌కార్డులు ఉన్నాయి.

ప్రభుత్వం వీరందరికీ రెండు గ్యారంటీలను అమలు చేయాల్సి వస్తే ఎలాంటి అభ్యంతరాలు, నిబంధనలు లేకుండా అమలు చేయాలి. కానీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) కుటుంబాలనే అర్హులుగా పరిగణించాలని భావిస్తే మాత్రం గణనీయంగా కోత తప్పదని ఓ అధికారి తెలిపారు. ఈ పరిస్థితుల్లో లబ్ధిదారుడి ఆర్థిక, సామాజిక స్థితి గతులను కూడా పరిగణనలోకి తీసుకొని రెండు గ్యారంటీలను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే వచ్చిన ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసే కార్యక్రమం ఓవైపు సాగుతుండగా, విద్యుత్‌ శాఖ, పౌరసరఫరాల శాఖ తరఫున మరోసారి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ సాగనున్నట్లు సమాచారం. 

బిల్లులు ఎవరు కడితే వారి పేరుపైనే..
పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరా పథకాన్ని అమలు చేసేందుకు మంగళవారం నుంచే విద్యుత్‌ శాఖ రంగంలోకి దిగనుంది. ఈనెల కరెంటు బిల్లు లెక్కలు తీసుకునేందుకు వచ్చే వ్యక్తి  బిల్లు కోసం వచ్చినప్పుడే మీటర్‌ నంబర్‌ యాక్టివేట్‌ అవుతుంది. ఆ బిల్లుకు సంబంధించి ఉన్న ఇంటి యజమాని ఆధార్, రేషన్‌కార్డు (ఆహారభద్రతా కార్డు), ఫోన్‌ నంబర్లు, ఇతర వివరాలు ఎంట్రీ చేసే కార్యక్రమం కొనసాగనుంది.

ఒకవేళ ఇంటి యజమాని కాకుండా అద్దెకు ఉన్న వ్యక్తులు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నట్టయితే, ఆ కిరాయిదారు పేరు మీద మీటర్‌ను యాక్టివేట్‌ చేస్తారు. రేషన్‌కార్డు లేని వారి నుంచి వివరాలు తీసుకోరు. ఈ వివరాలతో పాటు ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తుల్లోని వివరాలు కూడా పరిశీలించి ప్రభుత్వం అర్హులను ఎంపిక చేయనుంది. ఉచిత విద్యుత్‌ పథకానికి ఏటా రూ.4 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. 

ఏడాదికి ఆరు సిలిండర్లు!
గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి సంబంధించి.. సిలిండర్‌ బుక్‌ చేసినప్పుడు డెలివరీ కోసం వచ్చిన వ్యక్తి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కేవైసీ తరహాలో లబ్ధిదారుల వివరాలను సేకరించడంతో పాటు గ్యాస్‌ సిలిండర్, ఆధార్, రేషన్‌కార్డు నంబర్లను తీసుకుంటారు. వీటితో పాటు ఆర్థిక స్థోమతను అంచనా వేయడానికి కుటుంబ వివరాలను కూడా తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ఇలావుండగా ఒక కుటుంబానికి సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు రూ.500 చొప్పున సరఫరా చేయాలనే అంశంపై స్పష్టత రావలసి ఉంది. అయితే ఒక పేద కుటుంబానికి ఏడాదికి 6 సిలిండర్లు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. సంవత్సరానికి 6 సిలిండర్లు రూ.500 చొప్పున ఇచ్చినా రేషన్‌కార్డుల లెక్క ప్రకారం ఏడాదికి రూ.3,245 కోట్లు సబ్సిడీ రూపంలో వెచ్చించాల్సి వస్తుందని అంచనా. అయితే దీనికి సంబంధించి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega