Telangana High Court: ప్రైవేటు దోపిడీని అడ్డుకోండి

6 May, 2021 15:16 IST|Sakshi

ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, ఆక్సిజన్, రెమిడెసివిర్‌ లాంటి వాటికి గరిష్ట ధరలు నిర్ణయించండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ∙ వారాంతపు లాక్‌డౌన్‌ను పరిశీలించండి

ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ అందించాలని కేంద్రానికి ఆదేశం

తదుపరి విచారణ 13కు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య చికిత్సలు, సీటీ స్కాన్‌లాంటి పరీ క్షలు, ఆక్సిజన్‌ సిలిండర్లు, రెమిడెసివిర్‌ లాంటి మం దులకు గరిష్ట ధరలు నిర్ణయిస్తూ తాజా మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నియంత్రణ ఆంక్షలను మరింత కఠి నతరం చేయాలని, అనూహ్యంగా పెరుగుతున్న కేసులు, మరణాలను దృష్టిలో ఉంచుకొని వారాం తపు లాక్‌డౌన్‌ పెట్టే విషయంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అలాగే రాత్రి కర్ఫ్యూను కొనసాగించే విషయంపై ఈనెల 8వ తేదీ కంటే ముందే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సం దర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. 

సమృద్ధిగా కరోనా పరీక్షల కిట్లు: డాక్టర్‌ శ్రీనివాసరావు
గతంలో ప్రజలు పరీక్షలు చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చేవారని, అయితే ప్రస్తుతం లక్షణాలు ఉన్న వారు మాత్రమే పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్నారని డాక్టర్‌ శ్రీనివాసరావు నివేదించారు. ఈ కారణంగానే పరీక్షల సంఖ్య తగ్గుతోందని, పరీక్ష కిట్లు సమృద్ధిగా ఉన్నాయని వివరించారు. ఈ వివరణతో సంతృప్తి చెందని కోర్టు.. ప్రజల దగ్గరికే వెళ్లి పరీక్షలు చేయాలని సూచించింది. పాజిటివ్‌ వచ్చిన వారితో కాంటాక్టులో ఉన్న వారికి పరీక్షలు చేయాలని ఆదేశించింది. అలాగే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలను 24 గంటల్లో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వివాహ శుభకార్యాల్లో, అంత్యక్రియల్లో పాల్గొనేవారి సంఖ్యను తగ్గించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు గత ఏడాది ఇచ్చిన జీవోను సవరిస్తూ 24 గంటల్లో కొత్త మార్గదర్శకాలతో మరో జీవో జారీ చేయాలని ఆదేశించింది.

ఆక్సిజన్, రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు సరఫరా చేయడం లేదని డాక్టర్‌ శ్రీనివాసరావు నివేదించారు. రాష్ట్రంలో 18–44 మధ్య వయస్సు గలవారి కోసం 3.5 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు కావాలని, వీరికి వ్యాక్సిన్‌ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. కాగా కేంద్రం కేటాయించిన ఆక్సిజన్, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు సహా ఇతర మందులు నిర్ణీత సమయంలోగా రాష్ట్రానికి చేరేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. అలాగే తమిళనాడు నుంచి ఆక్సిజన్‌ రానందున ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ అందించాలని కూడా ఆదేశించింది. 

కాల్‌ సెంటర్లకు అనూహ్య స్పందన: ఏజీ
కరోనా రోగుల కోసం హితం యాప్‌ అందుబాటులోకి తెచ్చామని, అలాగే కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని, వీటికి అనూహ్య స్పందన లభిస్తోందని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. అయితే కరోనా చికిత్సలకు సంబంధించిన సమాచారం తెలియజేసేలా అన్ని జిల్లాల్లో టోల్‌ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని, అలాగే వీటిని అనుసంధానిస్తూ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని ధర్మాసనం సూచించింది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మొబైల్‌ వ్యాన్ల ద్వారా పరీక్షలు చేయాలని ఆదేశించింది.  

ఆస్పత్రుల సిబ్బంది బ్లాక్‌మార్కెటింగ్‌ చేస్తున్నారు: డీజీపీ
కరోనా నియంత్రణ ఆంక్షలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 859 పెట్రోలింగ్‌ వాహనాలు, 1,523 ద్విచక్ర వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి నివేదించారు. కరోనా నియంత్రణ మందులను అక్రమంగా విక్రయిస్తున్న 39 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఆసుపత్రుల సిబ్బందే ఎక్కువగా మందులను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని తెలిపారు. దీంతో మందులను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్న వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి హైకోర్టు స్పష్టం చేసింది. మాస్కు లేకుండా వెళ్తున్న వారి వాహనాలను సీజ్‌ చేసే విషయాన్ని పరిశీలించాలని, ఈ మేరకు పోలీసులకు అధికారాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. 

ఆసుపత్రుల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి
భౌతికదూరం పాటింపు విషయంలో రెవెన్యూ, స్థానిక సంస్థల అధికారులతో కలిసి ఫంక్షన్‌ హాల్స్, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కోర్టు సూచించింది. అలాగే ఆసుపత్రుల దగ్గర రోగులు, వారి సహాయకులు అయోమయానికి గురవుతున్నారని, వారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించింది. అంత్యక్రియల కోసం ఎన్ని స్మశానాలు ఏర్పాటు చేశారు? అందులో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? జైళ్ళలో ఉన్న ఖైదీలు, వృద్ధులు, వికలాంగులు తదితరులకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ? తదితర వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.   

లక్ష టెస్టులు చేసేలా చర్యలు తీసుకోండి
గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై రెండురోజుల్లో నిపుణులతో కమిటీ వేయాలని, కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్‌ సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామని, ఆన్‌లైన్‌లో సమావేశమవుతోందన్న ప్రభుత్వ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రోజూ లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. పరీక్షలు పెంచాలని పదేపదే ఆదేశించినా తగ్గిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల సంఖ్య తగ్గించడం ద్వారా వాస్తవ కేసుల సంఖ్య ఎలా తెలుస్తుందని, రోజూ లక్ష పరీక్షలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.  

చదవండి: 
విషాదం: కరోనాతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి మృతి
శ్మశానానికి దారి చూపుతూ నాయకుల ఫ్లెక్సీలు.. సిగ్గుందా మీకు!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు