ఆక్సిజన్‌ పెట్టారా? లేదా?

31 Jul, 2020 02:50 IST|Sakshi

పెట్టామని మీరంటే.. లేదని బాధితుడు వీడియో తీసి పంపారు

చెస్ట్‌ ఆస్పత్రిలో రోగి రవికుమార్‌ మృతిపై హైకోర్టు ఆగ్రహం

వైద్య నివేదికలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ‘‘కరోనాతో బాధపడుతున్న రోగి రవికుమార్‌కు ఆక్సిజన్‌ పెట్టామని చెస్ట్‌ ఆస్పత్రి సూపరింటెం డెంట్‌ చెబుతున్నారు. తనకు ఆక్సిజన్‌ మాస్కు తొలగించారని, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. మళ్లీ పెట్టాలని కోరినా పట్టించుకోలేదని రవికుమార్‌ వీడియో తీసి పంపారు. ఇందులో ఏది నిజం. ఈ వ్యవహారంలో వాస్తవాలేంటో తెలుసుకునేందుకు పోలీసు దర్యాప్తునకు ఆదేశించాలా?’’అని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే రవికుమార్‌ మృతి చెందారంటూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు బొల్గం యశ్‌పాల్‌గౌడ్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యా జ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.

రవికుమార్‌ గుండె సంబంధవ్యాధితో చనిపోయారని, వైద్యం అందించడంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. రవికుమార్‌కు సంబంధించిన వైద్య నివేదికలు సమర్పించారా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించగా లేదని సమాధానమిచ్చారు. కొంత సమయం ఇస్తే రికార్డులు సమర్పిస్తామని చెప్పగా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఇందులో డాక్టర్ల నిర్లక్ష్యం లేదని తామెలా భావించాలి? నిబంధనల మేరకు కరోనా రోగికి అందించాల్సిన అన్ని చికిత్సలు చేశామంటున్నారు.

మరి వైద్యనివేదికలు మా పరిశీలనకు ఎందుకు ఇవ్వడం లేదు ?’’అని ధర్మాసనం ప్రశ్నించింది. అదే ఆస్పత్రిలో మరో రోగి కూడా వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయారని, అతడు కూడా చనిపోయే ముందు వీడియో తీసి పంపారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రియాంకా చౌదరి నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం..రవికుమార్‌కు సంబంధించిన వైద్య నివేదికలను సమర్పించాలని చెస్ట్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశిస్తూ...విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. 

>
మరిన్ని వార్తలు