ఆవిష్కరణల్లో తెలంగాణకి 4వ స్థానం.. 

21 Jan, 2021 10:04 IST|Sakshi

ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌–2020 విడుదల చేసిన నీతి ఆయోగ్‌

36 అంశాల్లో ఆవిష్కరణలు, అభివృద్ధి ఆధారంగా ర్యాంకులు 

దేశ సగటు స్కోరు 23.4.. తెలంగాణ స్కోరు 33.23 

పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మళ్లీ కర్ణాటకకే మొదటి స్థానం 

కేంద్రపాలిత ప్రాంతాల కేటగిరీలో ఢిల్లీ టాప్‌.. అట్టడుగున లక్షదీ్వప్‌ 

మొదటి 5 స్థానాల్లో నాలుగు స్థానాలు దక్షిణ రాష్ట్రాలకే  

సాక్షి, హైదరాబాద్‌: ఆవిష్కరణల సూచీలో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. వ్యవస్థీకృత మూలధన ఒప్పందాలు, సులభతర వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక, ఉన్నత, సాంకేతిక విద్యా రంగాలకు పెట్టిన ఖర్చు, భద్రత, పారిశ్రామిక క్లస్టర్ల సంఖ్య లాంటి కీలకాంశాల ఆధారంగా నీతి ఆయోగ్‌ నివేదిక రూపొందించింది. ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌–2020 పేరిట రెండో ఎడిషన్‌ను నీతి ఆయోగ్‌ బుధవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఢిల్లీ ప్రథమ స్థానంలో నిలవగా, లక్షద్వీప్‌ కేంద్రపాలిత ప్రాంతం చివరి స్థానంలో ఉంది. మూడు కేటగిరీలుగా ఈ ర్యాంకులు ఇవ్వగా, పెద్ద రాష్ట్రాల జాబితాలో తొలి 5 ర్యాంకులు దక్షిణ భారతదేశానికి చెందిన నాలుగు రాష్ట్రాలకు దక్కాయి. రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆవిష్కరణల సూచీ స్కోరును పోల్చేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో పెద్ద రాష్ట్రాలు, పర్వత ప్రాంతాలు, కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. 

పెద్ద రాష్ట్రాల కేటగిరీలో తొలి స్థానంలో కర్ణాటక నిలిచింది. తదుపరి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బిహార్‌ నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు, నగరాలు రాష్ట్రాలుగా ఉన్న కేటగిరీలో ఢిల్లీ, చండీగఢ్, డామన్‌ డయ్యూ తొలి మూడు స్థానాల్లో నిలవగా, ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. వ్యవస్థీకృత మూలధన ఒప్పందాలు, జియోగ్రాఫికల్‌ ఇండికేటర్ల ఏర్పాటు, ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల కారణంగా కర్ణాటకకు మొదటి స్థానం దక్కిందని నివేదిక వెల్లడించింది. రెండో స్థానంలో మహారాష్ట్ర (38) ఉండగా, బిహార్‌ (14.5) చివరి స్థానంలో నిలిచింది. విశేషమేమిటంటే... ఆవిష్కరణ సూచీ సోర్కులో మొదటి ఐదు పెద్ద రాష్ట్రాల్లో నాలుగు దక్షిణ భారతదేశానికి చెందినవే. ఇందులో తెలంగాణ 33.23 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచింది. కాగా, ఆవిష్కరణల సూచీలో ఏపీ మెరుగైన పనితీరు కనబరిచి మూడు స్థానాలు ఎగబాకింది. 2019లో వెల్లడించిన సూచీలో 10వ స్థానంలో ఉన్న ఏపీ.. తాజా నివేదికలో 7వ ర్యాంకు సాధించింది. 

ఆవిష్కరణల సూచీలో తెలంగాణ వివరాలు.. 

  • తెలంగాణ స్థూల ఉత్పత్తి రూ. 1,43,618 కోట్లు. 
  • పీహెచ్‌డీ ఎన్‌రోల్‌మెంట్‌లో 11.95, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఎన్‌రోల్‌మెంట్‌లో 62.83, న్యాక్‌ ఇచి్చన గ్రేడుల ఆధారంగా రాష్ట్రంలోని మెరుగైన విద్యాసంస్థల విషయంలో 6.11, విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తిలో 87.76, ఐటీ ల్యాబ్‌లు ఉన్న పాఠశాలల్లో 14.05, జాతీయ లక్ష్యసాధన సర్వే (ఎన్‌ఏఎస్‌)లో 87.21 స్కోరు రాష్ట్రానికి లభించింది. 
  • ఉన్నత, సాంకేతిక విద్యలపై పెట్టే ఖర్చు విషయంలో అతి తక్కువగా 2.22, పరిశోధనల ఖర్చులో 6.74, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకలో 17.05, వ్యవస్థీకృత మూలధన ఒప్పందాల్లో 12.85 స్కోరు వచి్చంది.  
  • సులభతర వాణిజ్యంలో 92.86, ఆన్‌లైన్‌ సరీ్వసుల లావాదేవీల్లో 36.89, ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 20.19, ఇంక్యుబేటర్‌ సెంటర్ల ఏర్పాటులో 5.53, పారిశ్రామిక క్లస్టర్ల విషయంలో 38.21 స్కోరు వచ్చింది. 
  • ఐటీ ఎగుమతుల్లో 61.2, కొత్త వ్యాపారాల రిజి్రస్టేషన్లలో 51.11, పేటెంట్ల కోసం చేసిన దరఖాస్తుల్లో 37.71, స్టార్టప్‌ల కేటగిరీలో 30.11, భౌగోళిక సూచీలలో 34.09 స్కోరు రాష్ట్రానికి లభించింది.  

ప్రతిభ సద్వినియోగం కావట్లేదు.. 
మొత్తం 36 అంశాలను పరిగణనలోకి తీసుకోగా, జాతీయ సగటు స్కోరు 23.4గా తేలింది. దేశవ్యాప్తంగా ఆవిష్కరణల సామర్థ్యాన్ని పరిశీలిస్తే అందులో భద్రత, చట్టాలు అమలవుతున్న తీరులో 60.3 స్కోరు, మానవవనరుల్లో 42.3 స్కోరుగా నమోదైంది. పెట్టుబడుల స్కోరు మాత్రం అతి తక్కువగా 10.9 నమోదైంది. ఇందులో దేశ ప్రతిభకు సంబంధించిన స్కోరు 17.9 శాతం మాత్రమేనని నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. అంటే దేశంలో ఉన్న ప్రతిభను సరిగా వినియోగించుకోలేకపోతున్నామని తేలి్చంది. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పాటు నైపుణ్యం కలిగిన శ్రామికులు తక్కువగా ఉండటం, పరిశోధనలకు పెద్దగా ఖర్చు చేయకపోవడం, ఉన్నత విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలు, పర్యావరణం కోసం కూడా తక్కువ ఖర్చు చేయడం వంటివి దేశ ప్రగతికి ప్రతిబంధకాలుగా మారాయని తెలిపింది.  

ఆవిష్కరణ సూచీ లెక్కగట్టారిలా 
ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌–2020 నివేదిక కోసం నీతి ఆయోగ్‌ పలు అంశాలను ప్రాతిపదికలుగా తీసుకుంది. మూడేళ్ల సగటున ఉన్నత, సాంకేతిక విద్య, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ రంగాలకు పెట్టిన ఖర్చు, సులభతర వాణిజ్యం, రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్ల సంఖ్య, రాష్ట్రంలో ఉన్న సైబర్‌క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్ల సంఖ్య, గత పదేళ్లు అంతకన్నా ఎక్కువ సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులపై ఆయా రాష్ట్రాలు నీతి ఆయోగ్‌కు ఇచ్చిన వివరణలను పరిగణనలోకి తీసుకుని స్కోర్లు ఇచ్చింది. 
 

మరిన్ని వార్తలు