మళ్లీ మొదలైంది.. మరో 235 మందికి కరోనా

30 Dec, 2021 05:00 IST|Sakshi

జీహెచ్‌ఎంసీలోనే 121 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే భారీ తేడా కనిపిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారమే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ నెల 23వ తేదీన రాష్ట్రంలో 177 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, బుధవారం ఏకంగా 235కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అందులో జీహెచ్‌ఎంసీలో 23వ తేదీన 93 కేసులు నమోదైతే, 28వ తేదీన 110 కేసులు, తాజాగా 121 కేసులు రికార్డు అయ్యాయి.

ఇలా వారం రోజుల్లో 11 జిల్లాల్లో కేసులు పెరిగాయి. కాగా తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6.81 లక్షలకు చేరుకున్నాయి. ఒక రోజులో 204 మంది కోలుకోగా, ఇప్పటివరకు మొత్తం 6.73 లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో 4,024 మంది చనిపోయారు. ఇదిలావుండగా ముప్పున్న దేశాల నుంచి బుధవారం 346 మంది ప్రయాణికులు రాగా, అందులో 10 మందికి సాధారణ పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

వీరి శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. తాజా శాంపిళ్లతో కలుపుకొని ఫలితాలు రావాల్సినవి 23 కేసులున్నాయి. ఇప్పటివరకు 62 మందికి ఒమిక్రాన్‌ వ్యాపించిన విషయం తెలిసిందే. వారిలో తాజాగా ఐదుగురు కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 18కి చేరిందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఇక ఇప్పటివరకు ముప్పున్న దేశాల నుంచి 12,267 మంది ప్రయాణీకులు హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు.

మరిన్ని వార్తలు