హడలెత్తించిన పులి

19 Nov, 2021 05:06 IST|Sakshi
కార్తీక స్నానాలకు వెళ్లిన వారిని క్షేమంగా తీసుకువస్తున్న గ్రామస్తులు, పోలీసులు  

కార్తీక స్నానాలకు వెళ్లిన 30 మంది గ్రామస్తులు.. వెంబడించిన పులి

నాలుగు గంటలు ఉత్కంఠ 

పోలీసుల సహకారంతో క్షేమంగా ఇంటికి.. 

కుమురంభీం జిల్లాలో ఘటన  

దహెగాం(సిర్పూర్‌): కార్తీక స్నానాలు, దేవర మొక్కులకు వెళ్లిన గ్రామస్తులను పెద్దపులి వెంబడించింది. వారికి సమీపంలోనే తిరుగుతూ హడలెత్తించింది. దీంతో పులి ఎక్కడ దాడి చేస్తుందోననే భయంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నాలుగు గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచి్చంది. తర్వాత పోలీసులు, స్థానికుల సహకారంతో ఎట్టకేలకు 30 మంది క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. కుమురంభీం జిల్లా దహెగాం మండలం లోహా సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం తర్వాత చిన్నరాస్పెల్లి గ్రామానికి చెందిన 30 మంది కార్తీక స్నానాలు, దేవర మొక్కుల కోసం ఎడ్లబండ్లపై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు వాగుల గడ్డ వద్దకు వెళ్లారు. ఎర్రవాగు, పెద్దవాగు, మరోవాగు కలిసే చోట కార్తీక స్నానాలు చేయాలని భావించి, అనువైన చోటుకోసం చూస్తుండగా అదే ప్రాంతంలో వారికి పెద్దపులి కనిపించింది. దీంతో భయపడిన గ్రామస్తులు ఒక్కచోట చేరి డప్పు చప్పుళ్లు చేయడంతోపాటు కేకలు వేశారు.

అయినా పులి అక్కడి నుంచి కదల్లేదు. అక్కడే ఉంటూ గ్రామస్తుల కదలికలను గమనించసాగింది. సాయంత్రం అయినా పులి అక్కడి నుంచి వెళ్లిపోలేదు. వారికి సమీపంలోనే తిరుగుతూ కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు మండల రైతు సమన్వయ సమితి కనీ్వనర్‌ సంతోగౌడ్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ఆయన ఇచి్చన వివరాల మేరకు అటవీ అధికారులు, దహెగాం ఎస్సై రఘుపతి, పోలీసు సిబ్బంది, చిన్నరాస్పెల్లి నుంచి వచ్చిన గ్రామస్తులు డప్పు చప్పుళ్లు చేసుకుంటూ.. కాగడాలు పట్టుకుని వాగు వద్దకు వెళ్లారు.

పోలీసులు, అటవీ సిబ్బంది వచ్చే సమయానికి పులి దూరంగా వెళ్లిపోయినా.. అది మళ్లీ ఏ దిక్కునుంచి వచ్చి దాడి చేస్తుందోనని వారంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరికి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అధికారులు వాగువద్ద చిక్కుకున్నవారిని క్షేమంగా గ్రామానికి తీసుకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గత సంవత్సరం నవంబర్‌లో పెద్దపులి ఇద్దరిపై దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో పత్తి తీయడానికి వెళ్లే వారు సైతం భయాందోళన చెందుతున్నారు. 

పులి బెదరలేదు.. 
దేవరను తీసుకొని చిన్నరాస్పెల్లి నుంచి లోహా సమీపంలోని మూడు వాగుల గడ్డ వద్దకు కార్తీక స్నానానికి వెళ్లినం. ఒడ్డు వద్ద పెద్దపులి ఉంది. ముందుగా కుక్క అనుకొని దగ్గరకు వెళ్లి చూస్తే పులి.. ఒక్కసారిగా భయమైంది. మెల్లగా వెనుదిరిగి వచ్చి అందరికి చెప్పిన. డప్పు చప్పుళ్లు, కేకలు వేసినా అది బెదరకుండా అక్కడే ఉంది. అఖండ దీపం పెట్టిన చోటుకు వచి్చంది. అతి దగ్గర నుంచి అందరం పెద్దపులిని చూసినం. 
– ప్రత్యక్ష సాక్షి వెంకటేశ్‌ 

మరిన్ని వార్తలు