వంశీ వర్సెస్‌ కందుల.. ‘దక్షిణ’ నాదంటే నాదే!

29 Mar, 2024 01:15 IST|Sakshi

వంశీకృష్ణకు టికెట్‌ వట్టిదేనంటున్న కందుల

తనకే ఇచ్చారని వంశీకృష్ణ ప్రచారం

మంగళగిరికి చేరిన ఇద్దరి పంచాయతీ

పవన్‌ను కలిసేందుకు కందుల పయనం

సీటివ్వకపోతే జనసేనకు గుడ్‌బై చెబుతానని స్పష్టీకరణ

సాక్షి, విశాఖపట్నం: జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటు రసకందాయంలో పడింది. ఈ టికెట్‌ నాదంటే నాదని ఇద్దరు నాయకుల మధ్య వార్‌ జరుగుతోంది. ఈ సీటును కార్పొరేటర్లు సాధిక్‌, కందుల నాగరాజులతో పాటు మూగి శ్రీనివాస్‌లు ఆది నుంచీ ఆశిస్తున్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ తెరపైకి వచ్చారు. జనసేన అభ్యర్థుల జాబితాల్లో విశాఖ దక్షిణ అభ్యర్థి పేరును ప్రకటించలేదు.

అయినా ఈ సీటును తనకే ఖరారు చేశారంటూ వంశీకృష్ణ స్వయంగా ప్రకటించుకుని ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. వంశీ అభ్యర్థిత్వంపై దక్షిణం సీటును ఆశిస్తున్న ఈ ముగ్గురు నేతలూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. ‘వంశీ వద్దు.. స్థానికులే ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. కొద్దిరోజుల క్రితం ఒక మేకను తీసుకొచ్చి వంశీతో పోలుస్తూ ఈ సీటును బలి చేయొద్దని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో వంశీ వర్గీయులు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ జనసేన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో జనసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. వంశీ ఎన్నికల ప్రచారానికి వ్యతిరేక వర్గీయులు దూరంగా ఉంటున్నారు. మరోపక్క వంశీకృష్ణకు టికెట్‌ కేటాయింపు ప్రకటన వట్టిదేనని, అంతా బూటకమని కందుల బహిరంగంగానే చెబుతున్నారు. పవన్‌ ఆ సీటును తనకే ఖరారు చేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు.

మంగళగిరికి కందుల
జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కలిసి విశాఖ దక్షిణ సీటు తనకే కేటాయించాలని కోరేందుకు కందుల నాగరాజు గురువారం మంగళగిరికి పయనమయ్యారు. వంశీకృష్ణకు సీటిస్తే ఓడిపోతారని, తనకిస్తే గెలుస్తానని చెప్పడానికి వెళ్లారు. సీటు ఇస్తారన్న హామీతోనే గతంలో జనసేనలో చేరానని, ఒకవేళ తనకు టికెట్‌ కేటాయించకపోతే పార్టీకి గుడ్‌బై చెబుతానని పవన్‌కు స్పష్టం చేయనున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. మంగళగిరి పంచాయతీలో దక్షిణ టికెట్‌పై ఏం తేలుస్తారోనని జనసేన శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

ఇవి చదవండి: ‘సైకిల్‌’ దొంగ దొరికాడోచ్‌!

Election 2024

మరిన్ని వార్తలు