మంత్రి రేసులో సీతక్క, సురేఖ

5 Dec, 2023 11:01 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో తొలి కేబినేట్‌లో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది? 18 మంది మంత్రివర్గ సహచరులతో కొత్త సీఎం పరిపాలన చేయనున్న నేపథ్యంలో జిల్లాలో ఎందరికి అవకాశం దక్కనుంది? జిల్లాలో మొత్తం 10 స్థానాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎవరిని మంత్రి పదవి వరించనుంది?’ ఇదీ ఉమ్మడి వరంగల్‌లో సర్వత్రా సాగుతున్న చర్చ. 2023 అసెంబ్లీ ఎ న్నికల ఫలితాలు వెలువడిందే తడవుగా ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా సోమవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని హోటల్‌ ఎల్లాలో ఏఐసీసీ నేతలు మాణిక్‌రావు ఠాగూర్‌, డీకే శివకుమార్‌, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.

ఏకవాక్య తీర్మానంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు నిర్ణయాధికారం అప్పగించారు. సాయంత్రం వరకు సీఎల్‌పీ నేత ఎంపిక పూర్తవుతుందని భావించినా.. అది మంగళవారానికి వాయిదా పడింది. సీఎల్‌పీ నిర్వహించిన ఏఐసీసీ పరిశీలకులకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. సీఎల్‌పీ నేత ఎంపికతో పాటు మంత్రివర్గ కూర్పు కూడా అక్కడే జరగనున్న నేపథ్యంలో.. ఆజాబితాలో జిల్లా నుంచి ఎవరుంటా రు? ఉమ్మడిజిల్లా నుంచి మంత్రిగా ఎవరికి అవకా శం దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

మంత్రి రేసులో సీతక్క, సురేఖ
ఉమ్మడి వరంగల్‌లో 12 అసెంబ్లీ స్థానాలకుగాను 10 చోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించగా.. ఇక్కడి నుంచి ఇద్దరికి అవకాశం లభించవచ్చంటున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనూ పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌కు మంత్రి పదవులు దక్కాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ ఇద్దరికి అవకాశం ఉంటుందంటున్నారు. ములుగు నుంచి వరుసగా రెండోసారి 33,700 పైచిలుకు ఓట్లతో గెలిచిన ధనసరి సీతక్కకు మొదట కీలకమైన మంత్రి పదవి వరించనుందనే చర్చ జరుగుతుండగా.. రెండో మంత్రి కోసం కొండా సురేఖ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు.

► ములుగు మండలం జగ్గన్నపేటకు చెందిన వ్యవసాయకూలీల కుటుంబంలో పుట్టిన సీతక్క రాజకీయాల్లోకి రాకముందు జనశక్తి పార్టీకి సంబంధించిన అజ్ఞాత దళంలో దళ కమాండర్‌గా పని చేశారు. ఆతర్వాత జనజీవన స్రవంతిలో కలిసి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. న్యాయవాదిగా వరంగల్‌ కోర్టులో ప్రాక్టీసు చేశారు. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండుసార్లు ము లుగు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడోసారి గెలిచి కీలక నాయకురాలిగా ఎదిగిన ఆమెను రేవంత్‌రెడ్డి దేవుడిచ్చిన ఆడబిడ్డగా చెప్పారు. ఏఐసీసీ అధిష్టానంలోనూ మంచిపేరున్న ఆమెకు మంత్రి పదవి ఖాయమైనట్లే అంటున్నారు.

► రెండో మంత్రి పదవి కోసం వరంగల్‌ తూర్పు నుంచి గెలుపొందిన కొండా సురేఖ ప్రయత్నంలో ఉన్నారు. బీసీ(పద్మశాలి) సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ ఎంపీటీసీ నుంచి మంత్రి వరకు అనేక పదవుల్లో కొనసాగారు. గీసుకొండ ఎంపీపీగా, 1999, 2004 శాయంపేట ఎమ్మెల్యేగా, 2009 పరకాల, 2014లో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేగా, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కేబినెట్‌లో రాష్ట్ర మంత్రిగా పని చేశారు. భర్త కొండా మురళి సహకారంతో రాజకీయాల్లో రాణించి ఆమె కూడా ఈసారి వరంగల్‌ తూర్పు నుంచి గెలిచి మంత్రి పదవి ఆశిస్తున్నారు.

► టీడీపీ నుంచి 1994, 1999, 2004లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఈ ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. సీనియర్‌ నేత, శాసనసభ్యుడిగా ఉన్న రేవూరి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

7న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం..
సోమవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని హోటల్‌ ఎల్లాలో ఏఐసీసీ నేతలు మాణిక్‌రావు ఠాగూర్‌, డీకే శివకుమార్‌.. ఎమ్మెల్యేలతో భేటీ అయిన నేపథ్యంలో సీఎల్‌పీ నేత, సీఎం పేరు ప్రకటిస్తారని అందరూ భావించారు. ఏకవాక్య తీర్మానంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు నిర్ణయాధికారం అప్పగించిన కొద్ది గంటల్లో సీఎల్‌పీ నేత ఎంపిక పూర్తయి కొత్త సీఎం రాత్రి 8.30 గంటలకు ప్రమాణస్వీకారం పూర్తవుతుందనకున్నారు. పూర్తిస్థాయిలో మంత్రివర్గంతో సోనియాగాంధీ జన్మదినం రోజున లాల్‌బహదూర్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్‌ పెద్దలు ప్రకటించారు.

సీఎల్‌పీ నేత ఎంపికపై స్పష్టమైన ప్రకటన రాకపోగా.. అందుకు భిన్నంగా ఏఐసీసీ పరిశీలకులుగా ఉన్న డీకే శివకుమార్‌, మాణిక్‌రావు ఠాగూర్‌ తదితరులకు ఢిల్లీకే రావాల్సిందిగా అధిష్టానం సూచించడంతో హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలోనే మంగళవారం సమావేశం కానున్న ఏఐసీసీ, టీపీసీసీ నేతలు.. సీఎంతో పాటు మంత్రి వర్గం కూర్పుపై తేల్చనున్నారని సమాచారం. కాగా ఇప్పటికే సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు ఖరారైందని, 5, 6 తేదీల్లో మంచిరోజులు లేకపోవడంతో 7న ఉదయం 10 గంటలకు కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ నుంచి ఎంపికయ్యే మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేసే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం.

>
మరిన్ని వార్తలు