కీలక వీడియో రిలీజ్‌ చేసిన ట్రంప్‌

4 Oct, 2020 10:15 IST|Sakshi

ఆందోళన అక్కర్లేదు.. త్వరలోనే మీ ముందుకొస్తా

వీడియో రిలీజ్‌ చేసిన అమెరికా అధ్యక్షుడు 

వాషింగ్టన్‌: కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యం విషమిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఓ వీడియో ద్వారా ప్రజల ముందుకొచ్చారు. సంపూర్ణ ఆరోగ్యంతో అతి త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నేను ఆస్పత్రిలో చేరే సమయంలో అనారోగ్యంతో కాస్త ఇబ్బంది పడ్డా. ప్రస్తుతం బాగానే ఉన్నా’నని ట్రంప్‌ పేర్కొన్నారు. త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నానని.. కానీ రానున్న రెండు మూడు రోజులు అత్యంత కీలకం అని ఆయన అన్నారు.  (ట్రంప్‌కు కరోనా!)

అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే విడిచిపెట్టాల్సి వచ్చిందని.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వెంటనే ప్రచారాన్ని ఉధృతం చేస్తానని ట్రంప్‌ చెప్పారు. వాషింగ్టన్‌లోని వాల్టర్‌ రీడ్‌ మిలటరీ ఆస్పత్రిలో ట్రంప్‌ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన ‘వర్క్‌ ఫ్రమ్‌ హాస్పిటల్‌’ చేసేందుకు వీలుగా వైట్‌ హౌస్‌లోని స్పెషల్‌ సూట్‌ రూమ్‌ను ‘అధ్యక్ష కార్యాలయం’గా మార్చేశారు. అధికార నివాసం వైట్‌ హౌస్‌లోని అధికారులతో ట్రంప్‌ ఇక్కడి నుంచే నేరుగా మంతనాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 

ఆస్పత్రిలోనే ఈ వీడియో రికార్డు చేసినట్టు తెలుస్తున్నప్పటికీ ఎప్పుడు షూట్‌ చేశారనే విషయమై క్లారిటీ లేదు. ఆస్పత్రిలో చేరిన వెంటనే రికార్డు చేశారా లేక లేటెస్ట్‌ వీడియోనా అనే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ట్రంప్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని, రెండు రోజులు గడిస్తేగానే పూర్తి వివరాలు చెప్పలేమంటూ అధికార ప్రకటన వెలువడినట్టు వార్తలొచ్చాయి.  


 

Read latest World News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు