మత్స్యకారులకు ఓఎన్‌జీసీ పరిహారంపై సీఎం జగన్‌ భరోసా | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు ఓఎన్‌జీసీ పరిహారంపై సీఎం జగన్‌ భరోసా

Published Sat, Apr 20 2024 3:20 AM

-

మేమంతా సిద్ధం సభలో మీ బిడ్డ జగన్‌ వల్లనే

ఓఎన్‌జీసీ కమిటీ ఏర్పాటని వెల్లడి

ముమ్మిడివరంలో మాదిరిగా అందరికీ

మంచి జరుగుతుందని హామీ

కాకినాడ రూరల్‌: మత్స్యకారులందరికీ ఓఎన్‌జీసీ పరిహారంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అచ్చంపేట జంక్షన్‌ వద్ద మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ మత్స్యకారులకు పరిహారం కోసం ఓఎన్‌జీసీ కమిటీ ఏర్పాటు చేసిందంటే దానికి కారణం మీ బిడ్డ జగన్‌, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమే కారణం అన్నారు. ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని, ఈ రోజు కమిటీ ఏర్పాటయ్యిందని, ఆ కమిటీ రికమండేషన్‌ ఆధారంగా ప్రతీ మత్స్యకార కుటుంబానికి మంచి జరిగేటట్టుగా మీ బిడ్డ అండగా ఉంటాడని హామీ ఇస్తున్నానన్నారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యను పరిష్కరించి ముమ్మిడివరంలో మత్స్యకారులకు పరిహారం ఇచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అంతకుముందు బహిరంగ సభలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఈ తీరప్రాంతంలో ఓఎన్జీసీ ఒక సిస్మిక్‌ సర్వేతో 500 కిలోమీటర్ల మేర ఎక్కడా మత్స్యకారులు వేట చేయకూడదని, 35 కిలోమీటర్లు నో మ్యాన్‌ జోన్‌ అని ప్రకటించినప్పుడు మత్స్యకారుల ఉద్యమానికి అండగా నిలిచామన్నారు. తాను, సిటీ శాసనసభ్యుడు చంద్రశేఖరరెడ్డి, ఎంపీ వంగా గీత మత్స్యకారుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి మాట్లాడడంతోపాటు సీఎం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దీంతో కమిటీ ఏర్పాటుకు ఓఎన్‌జీసీ ముందుకు వచ్చిందన్నారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం 2019 ఎన్నికలకు ముందు కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో విజయశంఖారావాన్ని తొలిసభలో పూరించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ఇప్పుడు నామినేషన్ల పర్వం ప్రారంభమైన వెంటనే కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో సభకు రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మనందరి తరపున థ్యాంక్యూ సీఎం సార్‌ అని చెబుతున్నానన్నారు. జగనన్నకు, ఈ కుటిల నీతితో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు ఉన్న తేడా ఏమిటంటే మీతో పోలికే లేని నాయకుడు చంద్రబాబు తన మందీమార్బలాన్ని, మీడియా బలాన్ని వెనకేసుకుని ప్రతిరోజూ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. మీరు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తానంటుంటే చంద్రబాబు నాణ్యమైన మద్యాన్ని అందిస్తానంటున్నాడని ఇది చాలు మీకు, ఆయనకు ఉన్న పోలిక ఏమిటో అర్థమవుందని సీఎంను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబుకు బిల్డప్‌ ఎక్కువ, పని తక్కువ. సింపుల్‌ గా చెప్పాలంటే.. సంక్రాంతికి పప్పుబెల్లాలను చంద్రబాబు పంచిపెడితే, మీరు ఇచ్చే కానుకలు జీవితాలను నిలబెట్టేవి, భవిష్యత్‌ తరాలకు తల రాత రాసేవన్నారు. ఇంగ్లిష్‌ మీడియం మొదలుకుని వైద్యం, విద్య, ఆరోగ్యాల్లో ఒక విప్లవాన్ని మీరు సృష్టించారని, ఇంటి స్థలం, వైద్యం, ఆరోగ్యశ్రీ అదేవిధంగా ఎన్నో కానుకలు మీరు అందించి చేయూత, భరోసాలాంటివి కూడా అందించి భవిష్యత్‌ తరాలను తీర్చిదిద్దుతున్నారని సీఎంకు కన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement